Sachin Tendulkar: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ వర్ధంతి.. సచిన్ భావోద్వేగ ట్వీట్

Sachin Tendulkar pens heartfelt note on Shane Warnes death anniversary

  • షేన్ వార్న్ చనిపోయి ఏడాది
  • ట్విట్టర్ లో నివాళులర్పించిన సచిన్, గిల్ క్రిస్ట్, మైఖేల్ వాన్
  • గొప్ప క్రికెటర్ గానే కాదు.. గొప్ప స్నేహితుడి గానూ వార్న్ ను మిస్ అవుతున్నానని సచిన్ ట్వీట్

ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ స్పిన్నర్ గా పేరు పొందిన షేన్ వార్న్ చనిపోయి ఏడాది కావస్తోంది. గతేడాది మార్చి 7న ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో వార్న్ తో ఉన్న అనుబంధాన్ని లెజెండరీ క్రికెటర్లు స్మరించుకుంటున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆడమ్ గిల్ క్రిస్ట్, మైఖేల్ వాన్ తదితరులు ఈ రోజు భావోద్వేగ ట్వీట్లు చేశారు.

ఒక్క గొప్ప క్రికెటర్ గానే కాదు.. ఒక గొప్ప స్నేహితుడి గానూ వార్న్ ను మిస్ అవుతున్నానని సచిన్ పేర్కొన్నారు. ‘‘మైదానంలో కొన్ని చిరస్మరణీయ యుద్ధాలను మనం చేశాం. వాటి నుంచి మరపురాని క్షణాలను కూడా పంచుకున్నాం. గొప్ప క్రికెటర్‌గానే కాకుండా గొప్ప స్నేహితుడిగా కూడా నిన్ను మిస్ అవుతున్నా. నీ హాస్యం, సమ్మోహన శక్తితో మరింత మనోహరమైన ప్రదేశంగా స్వర్గాన్ని మార్చుకుని ఉంటావని అనుకుంటున్నాను వార్నీ!’’ అని సచిన్ ట్వీట్ చేశారు. 

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా వార్న్ ను స్మరించుకున్నారు. ‘‘కలను వెంబడించేలా నన్ను ప్రేరేపించిన వ్యక్తికి.. మన వైపు ఉండాలని కోరుకునే మరో వ్యక్తికి నివాళి’’ అని పేర్కొన్నారు. షేన్ వార్న్ తోపాటు ఆసీస్ మరో దిగ్గజం రాడ్ మార్ష్ ఫొటోను గిల్లీ ట్వీట్ చేశారు. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. ‘కింగ్’ అంటూ వార్న్ ను గుర్తు చేసుకున్నారు. ‘ఆర్ఐపీ కింగ్.. వార్నీ’ అని ట్వీట్ చేశారు.

క్రికెట్ చరిత్రలో దిగ్గజ స్పిన్నర్లలో ఒకరిగా షేన్ వార్న్ చోటు దక్కించుకున్నారు. 145 టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నారు. 2007 నుంచి 1992 దాకా 15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడారు. తన జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. 1999లో వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ టీమ్ మెంబర్. ఇక తొలి ఐపీఎల్ ట్రోఫీని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకోగా.. నాడు కెప్టెన్ గా ఉన్నది షేన్ వార్న్ కావడం గమనార్హం.

Sachin Tendulkar
Shane Warne
Shane Warnes death anniversary
Adam Gilchirt
Michael Vaughan
  • Loading...

More Telugu News