Kolkata: పదో తరగతి పరీక్షకు వెళ్తున్న విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు!

Kolkata cop makes green corridor to help student reach examination centre

  • పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఘటన
  • పరీక్ష సమయం మించిపోతుండడంతో సాయం కోసం రోడ్డుపై అర్ధిస్తూ కనిపించిన బాలిక
  • ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చూసి తన అధికారిక వాహనంలో తీసుకెళ్లిన వైనం

ఓ బాలిక పదో తరగతి పరీక్షకు హాజరయ్యేందుకు అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. దీంతో బాలిక నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష రాసింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జరిగిందీ ఘటన. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ బాలిక హౌరా బ్రిడ్జి సమీపంలో ఏడుస్తూ అటువైపు వెళ్తున్న వారిని సాయం కోసం అర్థిస్తోంది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సౌవిక్ చక్రవర్తి అది చూసి బాలిక వద్దకెళ్లి ఆరా తీశారు. 

తాను శాయంబజార్‌లోని ఆదర్శ్ శిక్ష నికేతన్‌లో పదో తరగతి పరీక్షలు రాస్తున్నానని, అక్కడికి వెళ్లాల్సి ఉందని, సాయం చేయాలని కోరింది. మరి ఇంట్లో వారు ఎవరూ రాలేదా? అన్న ఆయన ప్రశ్నకు.. తన తాతయ్య చనిపోయారని, కుటుంబ సభ్యులందరూ అంత్యక్రియలకు వెళ్లారని చెప్పింది.

దీంతో కదిలిపోయిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్.. బాలికను తన అధికారిక వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రానికి బయలుదేరారు. పరీక్షకు సమయం దగ్గరపడుతుండడంతో ఆ మార్గంలో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత సమయానికి బాలికను పరీక్ష కేంద్రం వద్ద దింపడంతో బాలిక పరీక్ష రాసింది. కోల్‌కతా పోలీసులు ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టు కాస్తా వైరల్ కావడంతో పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News