Chandrababu: చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై యనమల, పయ్యావుల ఫైర్

TDP leaders reaction after police obstruct Chandrababu

  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • బలభద్రపురంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • ప్రభుత్వ అరాచకత్వం అంటూ యనమల మండిపాటు
  • ప్రతి పోలీసు అధికారి పేరును నోట్ చేస్తున్నామన్న పయ్యావుల

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ చంద్రబాబు సభలను అడ్డుకోవడం ప్రభుత్వ అరాచకత్వానికి, నిరంకుశత్వానికి అద్దం పడుతోందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని ఆంక్షలు ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టడం జగన్ రెడ్డి ఫ్యూడల్ మనసత్వానికి అద్దంపడుతున్నాయని విమర్శించారు. 

పోలీసులతో తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవాలనుకోవడం హేయనీయం అని యనమల పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ పెద్దలు తెలుగుదేశం పార్టీ సభలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్న విషయం ఈ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని తెలిపారు.

చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం : పయ్యావుల కేశవ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను పోలీసులే అడ్డుకోవడం దుర్మార్గం అని మరో సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి పేరును డైరీలో నోట్ చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఎవర్నీ వదిలపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్ అండ్ కో హడలిపోతుందని అన్నారు. 

అనపర్తిలో చంద్రబాబు ప్రసంగించకుండా పోలీసులను ఉపయోగించి బహిరంగ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆరోపించారు. అనపర్తి సభకు జిల్లా పోలీసుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా అకారణంగా సభకు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News