assembly: 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం.. విద్యార్థులకు 3 వేల రూపాయల మెస్ చార్జీలు ఇవ్వలేమా?: భట్టి విక్రమార్క

  • అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భట్టి విక్రమార్క
  • రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ భారీగా ఉందని వ్యాఖ్య
  • పన్ను ఆదాయాన్ని భారీగా పెంచి చూపారని ఆరోపణ
  • కొత్తగా పన్నులు వేసే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్న
Batti vikramarka speech on budget in telangana assembly

రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో చదువుకుంటున్న పేద విద్యార్థులు రాష్ట్రానికి ఆస్తి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డబ్బుకు వాళ్లు పేద వారే కానీ మేధస్సులో అపార సంపన్నులని చెప్పారు. రేపు దేశానికి ఎంతగానో ఉపయోగపడతారని, అలాంటి విద్యార్థులకు మెస్ బిల్లు రూ.3 వేలు వస్తే మనం రూ.1,500 ఇస్తున్నామని చెప్పారు.

వారికి నెలకు రూ. 3వేలు ఇవ్వలేమా? అని ప్రభుత్వాన్ని భట్టి ప్రశ్నించారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో వారికి రూ.3 వేలు ఇచ్చేందుకు నిధులు లేవా? అని నిలదీశారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా బుధవారం భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడారు.

బడ్జెట్ పై చర్చలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉందని చెప్పారు. అయితే, ఈ బడ్జెట్ పై తమకు పలు సందేహాలు ఉన్నాయని చెప్పారు. ఆదాయ అంచనాలు వాస్తవదూరంగా ఉన్నాయని అన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ లెక్కలను పరిశీలిస్తే.. గతేడాది కన్నా ఈ ఏడాది రూ.40 వేల కోట్లు ఎక్కువగా చూపించారని భట్టి పేర్కొన్నారు.

ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రాష్ట్రంలో కొత్తగా పన్నులు విధించబోతున్నారా.. ఇప్పటికే విధిస్తున్న పన్నులు పెంచబోతున్నారా.. ప్రభుత్వం ఏంచేయబోతోందని ప్రశ్నించారు. కొత్త పన్నులు విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేకుంటే ఈ 40 వేల కోట్లు బడ్జెట్ లో చూపించడం ఆశ్చర్యకరమేనని వ్యాఖ్యానించారు.

More Telugu News