Team India: విరిగిన చేత్తోనే మళ్లీ బ్యాటింగ్ కు విహారి.. ఈసారి ఒంటిచేత్తో రివర్స్ స్వీప్ షాట్

batting with one hand Vihari played this shot
  • బంతి తగిలి విరిగిన విహారి ఎడమ మణికట్టు
  • అయినా క్రీజులోకి వచ్చి ఒంటిచేత్తో బ్యాటింగ్
  • అతని పోరాటానికి సలాం కొడుతున్న సోషల్ మీడియా
తెలుగు క్రికెటర్, ఆంధ్ర జట్టు రంజీ కెప్టెన్‌ హనుమ విహారి తన అసమాన పోరాటంతో మరోసారి ఆకట్టుకున్నాడు. చేయి విరిగినా.. లెక్కచేయకుండా బ్యాటింగ్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుతో ఇండోర్‌ లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జట్టు విజయం కోసం గొప్ప పోరాటం చేసి అందరి మనసు గెలుచుకున్నాడు.

 రెండు రోజుల కిందట తొలి ఇన్నింగ్స్ లో  బ్యాటింగ్‌ చేస్తుండగా బంతి బలంగా తగిలి అతని ఎడమ మణికట్టు విరిగింది. దాంతో, రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన విహారి మొదటి ఇన్నింగ్స్ లో తొమ్మిదో వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చి అబ్బురపరిచాడు. ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి పదో వికెట్ కు విలువైన పరుగులు జోడించాడు. దాంతో, ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ లో 379 పరుగులు చేయగా.. అనంతరం మధ్యప్రదేశ్‌ 228 రన్స్‌కు ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో ఆంధ్ర టాపార్డర్‌ విఫలమవడంతో.. విహారి మరోసారి చివరి వికెట్‌గా క్రీజులో అడుగుపెట్టి ఆకట్టుకున్నాడు.

ఒంటి చేత్తోనే ఆడుతూ 16 బంతులు ఎదుర్కొన్న విహారి 15 రన్స్‌ చేశాడు. అందులో మూడు ఫోర్లు ఉండటం విశేషం. ఇందులో అతను ఒంటిచేత్తో కొట్టిన రివర్స్ స్వీప్ షాట్ కూడా ఉండటం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయాన్ని లెక్క చేయకుండా రెండుసార్లు బ్యాటింగ్ కు రావడమే కాకుండా.. ఒంటిచేత్తోనే రివర్స్ స్వీప్ షాట్ తో ఫోర్ రాబ్టటిన తెలుగు క్రికెటర్ ప్రతిభ చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే, విహారి పోరాడినా మిగతా వాళ్లు విఫలమవడంతో ఆంధ్ర జట్టు 93 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 58 రన్స్‌ చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న మధ్యప్రదేశ్‌ విజయానికి ఇంకా 187 పరుగుల దూరంలో ఉంది.
Team India
Hanuma vihari
one hand
batting
ranji trophy

More Telugu News