Ponguleti Srinivasa Reddy: అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasareddy slams BRS leaders

  • బీఆర్ఎస్ నాయకత్వంపై మరోసారి ధ్వజమెత్తిన పొంగులేటి
  • ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేయబోనని వెల్లడి
  • తన వెంట లక్షలాది హృదయాలు ఉన్నాయని ధీమా

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి బీఆర్ఎస్ నాయకత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా 20 శాతమే చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. 

అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని, కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని, ఆ తుపానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు. 

ఓ చిన్న కుటుంబం నుంచి వచ్చిన తనను జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం తమ గుండెల్లో పెట్టి చూసుకుంటోందని, అందుకే ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.  జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ తన పక్షానే నడుస్తారని తెలిపారు. శీనన్న ఏ తప్పు చేయలేదని, ఎప్పటికీ తప్పు చేయడని తన గురించి తాను చెప్పుకున్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విషయంలో శీనన్న వెనుకడుగు వేయబోడని స్పష్టం చేశారు. 

"ఒకప్పుడు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను, ఖమ్మం ఎంపీగా ఉన్న నేను వారి మాటలు నమ్మి నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరాను. నాతో పాటు వందలాది మంది ప్రజాప్రతినిధులు, వేలాది మంది అభిమానులు టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టామన్నది నిజం. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా, జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశానంటూ నాపై నిందలు మోపారు. ఆ తర్వాత పెద్దలు కేసీఆర్, కేటీఆర్ మాట విని నాడు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం గ్రామగ్రామాన తిరిగి విజయం కోసం కృషి చేశాను. కానీ నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు" అని పొంగులేటి వివరించారు.

Ponguleti Srinivasa Reddy
BRS
Khammam
Ex MP
  • Loading...

More Telugu News