Suryanarayana: బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలపై మండిపడిన ఉద్యోగుల సంఘం నేతలు

Employees association leaders fires on Bandi Srinivasarao remarks

  • ఏపీలో ఎన్జీవో సంఘం వర్సెస్ ఉద్యోగుల సంఘం
  • బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ మధ్య మాటల యుద్ధం
  • నిన్న గవర్నర్ ను కలిసిన ఉద్యోగుల సంఘం నేతలు
  • సంఘాల మధ్య రాజుకున్న విభేదాలు

ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో, నిన్నటి నుంచి ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 

తాజాగా బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై సూర్యనారాయణ స్పందించారు. ఉద్యోగుల సర్వీసు నియంత్రణ అధికారం గవర్నర్ కే ఉందని, అందుకే ఆయనను కలిశామని వెల్లడించారు. తాము ఎక్కడా ఇతర సంఘాల పేరు, నేతల గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని జీవోలు ఉన్నాయే తప్ప చట్టం లేదని సూర్యనారాయణ స్పష్టం చేశారు. అలాంటి చట్టం ఉంటే చూపించాలని అన్నారు. 

రేపట్నించి సమ్మె చేసేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. కార్యాచరణ ప్రకారమే ముందుకు వెళతామని, సమ్మె చేస్తామని తాము చెప్పలేదని వివరించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి దొడ్డిదారిన గుర్తింపు తీసుకువచ్చినట్టు చేస్తున్న ఆరోపణలు సరికాదని హితవు పలికారు. 

జీతాలపై చట్టం చేయమంటే... సంఘం గుర్తింపు రద్దు చేయమంటారా? అని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘంపై గతంలోనూ ఫిర్యాదు చేశారని, కోర్టుకు కూడా వెళ్లారని ఆయన వివరించారు. అయితే ఎన్జీవో నేతల ఫిర్యాదు సరికాదంటూ సీఎం జగన్ తమ సంఘానికి గుర్తింపునిచ్చారని వెల్లడించారు. 

బండి శ్రీనివాసరావుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ వద్దకు వెళితే తప్పేముందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను గవర్నర్ కు నివేదించామని వెల్లడించారు. ఏపీ ఎన్జీవో సంఘం అడ్డు అదుపు లేకుండా నడుస్తోందని మండిపడ్డారు. రాజకీయానికి తొలిమెట్టు అన్నట్టుగా ఏపీఎన్జీవో సంఘం వైఖరి ఉందని విమర్శించారు.

ఏపీ ఎన్జీవో సంఘంలో నాన్ గెజిటెడ్ స్థాయి వారే ఉన్నారని, తమ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో అటెండర్ నుంచి అధికారుల వరకు ఉన్నారని ఆస్కార్ రావు వెల్లడించారు. తోటి సంఘం నేతలను ఖబడ్దార్... కాస్కో... చూస్కో అంటారా? ఉద్యోగులు ఉన్నది సంక్షేమం కోసం పనిచేయడానికా, కుస్తీలు పట్టడానికా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవో సంఘం నుంచి సగం మంది ఉద్యోగులు తమ సంఘంలో చేరారని ఆస్కార్ రావు తెలిపారు. తమ సంఘానిది నిర్మాణాత్మక వైఖరి అని స్పష్టం చేశారు.

Suryanarayana
Bandi Srinivasarao
AP Govt Employees Association
AP NGO
Andhra Pradesh
  • Loading...

More Telugu News