murder: రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మరో వ్యక్తిని చంపి.. తానే చనిపోయానని నమ్మించి పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి

 Telangana govt official kills man fakes own death to claim Rs 7 cr insurance arrested

  • స్టాక్ మార్కెట్ లో భారీగా నష్టపోయిన తెలంగాణ సచివాలయ ఉద్యోగి
  • ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి పథకం
  • కూలీని చంపి ఆ మృతదేహం తనదేనని నమ్మంచే ప్రయత్నం చేసిన వైనం

ఏడు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారి ఒకరు తాను చనిపోయినట్టు నకిలీ మరణాన్ని సృష్టించాడు. మరో వ్యక్తిని హత్య చేసి ఆ మృతదేహాన్ని తనదిగా నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో అతని భార్య, ఇద్దరు బంధువులు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రధాన నిందితుడు ధర్మా నాయక్ తెలంగాణ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ)గా పనిచేస్తున్నాడు. స్టాక్ మార్కెట్ లో రూ.85 లక్షల నష్టం వాటిల్లడంతో భార్య, బంధువులతో కలిసి ఈ పథకం వేశాడు. ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు, అప్పులు తీర్చేందుకు ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహాన్ని కారులో మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని వాగు దగ్గరకు తీసుకెళ్లారు. పెట్రోలు పోసి కారుకు నిప్పుపెట్టారు. పూర్తిగా కాలిపోయిన కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బ్యాగులో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా మృతుడు ప్రభుత్వ ఉద్యోగి అని ప్రాథమికంగా భావించారు. 

కానీ, మృతదేహం కాలు.. కూలీ పని చేసే వారిదిలా ఉండటం, ధర్మా నాయక్ కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై అనుమానం వచ్చి లోతుగా విచారించారు. చనిపోయాడు అనుకున్న ధర్మా నాయక్ బతికే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని మహారాష్ట్రలోని పూణేలో అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం తెలిపింది. నిజామాబాద్ కు చెందిన కూలీ బాబును చంపి అతని మృతదేహాన్ని తనదిగా నమ్మించాలనుకున్న మొత్తం వ్యవహారాన్ని ధర్మా నాయక్ వెల్లడించాడు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.

murder
Telangana
govt official
medak
Rs 7 cr insurance
  • Loading...

More Telugu News