BRS: ఖమ్మంలో బీఆర్ఎస్ సభ ప్రారంభం.... కేజ్రీవాల్, విజయన్, మాన్ వాడివేడి ప్రసంగాలు

BRS meetings starts in Khammam
  • హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు
  • మోదీ చెప్పినట్టల్లా గవర్నర్లు ఆడుతున్నారన్న కేజ్రీవాల్  
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్న భగవంత్ మాన్ 
  • రాజ్యాంగాన్ని మోదీ సర్కారు భ్రష్టుపట్టించిందని విమర్శించిన విజయన్ 

బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు ఈ సభకు హాజరయ్యారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతోందని, ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నామని వెల్లడించారు. మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివరించారు. ఇక, ఢిల్లీలో తాము ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్ లను ప్రవేశపెట్టామని, ఈ మొహల్లా క్లినిక్ లను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పరిశీలించారని కేజ్రీవాల్ తెలిపారు. మొహల్లా క్లినిక్ ల తరహాలోనే తెలంగాణ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంపైనా కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కంటి వెలుగు తరహా పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న సమీకృత కలెక్టరేట్ కాన్సెప్టు చాలా మంచిదని, ప్రజలకు సంబంధించిన అన్ని పనులు ఒకేచోట జరుగుతాయని వివరించారు. 

గవర్నర్లు కేవలం కీలుబొమ్మల్లా తయారయ్యారని, మోదీ చెప్పినట్టల్లా ఆడుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే ఈ గవర్నర్ల పని అని వ్యాఖ్యానించారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రసంగిస్తూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఎర్రకోటపై మోదీ గత ఎనిమిదేళ్లుగా ఒకే ప్రసంగం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని బీజేపీ తప్పుదారి పట్టిస్తోందని అన్నారు. దేశాన్ని భ్రష్టుపట్టించడంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. 

దేశం ఎటు పోతోందో అన్న ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు. యువత, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని వెల్లడించారు. ప్రభుత్వాలు కూలగొట్టడం బీజేపీకి అలవాటేనని భగవంత్ మాన్ అన్నారు. దేశం ప్రమాదంలో పడిందని కేసీఆర్ బాధపడుతున్నారని అన్నారు. ఈ సభ దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతం అని అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ఎంతో బాగుందని, తాము ఈ పథకాన్ని పంజాబ్ లోనూ అమలు చేస్తామని చెప్పారు. 

కేరళ సీఎం విజయన్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని మోదీ సర్కారు భ్రష్టుపట్టించిందని అన్నారు. బీజేపీపై కలిసిపోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మోదీ పాలన ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రజలను మతాలవారీగా విభజిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం పోరాడాల్సిన అవసరం ఉందని విజయన్ పిలుపునిచ్చారు. 

ఇవాళ్టి ఖమ్మం సభ దేశానికి దిక్సూచి అని అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం అవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని కీర్తించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమం చేపట్టిన కేసీఆర్ కు అభినందనలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని కేరళ సీఎం విజయన్ తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు కేరళలోనూ ప్రవేశపెడతామని చెప్పారు. 

అఖిలేశ్ యాదవ్ ప్రసంగిస్తూ, మోదీ పతనం ఖాయమని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. తెలంగాణ వాటర్ పాలసీని కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు. ఎన్నికల కోసమే బీజేపీ జీ20 ప్రచారం చేస్తోందని విమర్శించారు. దేశంలో కొత్త ప్రభుత్వం కోసం అందరం కలిసి ముందుకు సాగుదాం అని అఖిలేశ్ యాదవ్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News