Ajith: మూవీ రివ్యూ: 'తెగింపు'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'తెగింపు'
  • యాక్షన్ కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు 
  • మాస్ అంశాలను కూడా పక్కన పెట్టేసిన వైనం 
  • స్టైలీష్ మేకింగ్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణ 
  • ఇక్కడి ఆడియన్స్ ను మెప్పించడం కష్టమే 
Tegimpu Movie Review

అజిత్ కి తమిళనాట మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కెరియర్ తొలినాళ్లలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అజిత్, ఆ తరువాత మాస్ యాక్షన్ హీరోగా తన జోరు పెంచుతూ వచ్చాడు. మాస్ ఆడియన్స్ ఆశించే అంశాలు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ, ఎమోషన్ తో కూడిన యాక్షన్ కి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. సంక్రాంతి కానుకగా ఆయన నుంచి తమిళంలో వచ్చిన మరో యాక్షన్ మూవీనే 'తునివు'. తెలుగులో ఈ సినిమా 'తెగింపు' పేరుతో ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

ఈ కథ వైజాగ్ లో మొదలవుతుంది. అక్కడి ప్రైవేట్ బ్యాంకులో 500 కోట్లు అనధికారికంగా ఉంచినట్టుగా ఒక గ్యాంగ్ కి తెలుస్తుంది. ఆ డబ్బు కొట్టేసినా బ్యాంక్ వారు ఆ విషయాన్ని బయటికి చెప్పలేరు గనుక, సరైన సమయం చూసి ఆ బ్యాంకుపై ఎటాక్ చేస్తారు. ఆ సమయంలో బ్యాంకులో ఉన్నవారిని బంధిస్తారు. 500 కోట్లను కొల్లగొట్టడానికి వాళ్లు ట్రై చేస్తుండగా, ఆ పక్కనే ఉన్న రూమ్ లో నుంచి అజిత్ ఎంట్రీ  ఇస్తాడు. అతను మరో గ్యాంగ్ కి నాయకుడు.  

తన యాక్షన్ తో అజిత్ ఆ గ్యాంగును తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. దాంతో లోపల బందీలుగా ఉన్నవాళ్లంతా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. తాను కూడా ఆ బ్యాంక్ ను కొల్లగొట్టడానికే వచ్చినట్టుగా అజిత్ అప్పుడు చెబుతాడు. దాంతో ఆ గ్యాంగ్ ఉలిక్కిపడుతుంది. బందీలుగా ఉన్నవాళ్లు బిత్తరపోతారు. 500 కోట్లను కాజేసి రెండు వాటాలుగా తీసుకుందామని అవతల గ్యాంగ్ వాళ్లు అజిత్ తో బేరానికి దిగుతారు. 

500 కోట్ల కోసం ఇంత శ్రమపడవలసిన అవసరం తనకి లేదనీ, ఆ బ్యాంకులో సీక్రెట్ గా దాచబడిన 25వేల కోట్లను కొట్టేయడానికే తాను వచ్చినట్టుగా అజిత్ చెప్పడంతో వాళ్లు షాక్ అవుతారు.  ముందుగా పోలీసులు .. ఆ తరువాత ప్రత్యేక పోలీసు బలగాలు బ్యాంకును చుట్టుముడతాయి. బయట ఏం జరుగుతుందనేది ఒక వ్యాన్ లో నుంచి మానిటరింగ్ చేస్తూ అజిత్ కి కన్మణి (మంజూ వారియర్) చేరవేస్తూ ఉంటుంది. అజిత్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతూ, కూల్ గా డాన్సులు చేస్తూ .. లోపల దాచబడిన 25 వేల కోట్ల కోసం గాలిస్తూ ఉంటాడు. 

అదే సమయంలో ఆ బ్యాంకులో మరో గ్యాంగ్ కూడా ఉందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. ఆ విషయాన్ని గ్రహించేలోగా ఆ గ్యాంగ్ అజిత్ పై దాడి చేసి ఆయనను బంధిస్తారు. ఇప్పుడు బ్యాంకులో మూడు గ్యాంగులు ఉన్నాయి. రహస్యంగా దాచబడిన 25 వేల కోట్లు ఉన్నాయి. బ్యాంకుకి ఒకేఒక ఎంట్రీ మాత్రమే ఉంటుంది. బయట వందలాదిగా ప్రత్యేక పోలీసు బలగాలు ఉంటాయి. బ్యాంకు చైర్మన్ తో పాటు ఆ డబ్బుతో లింక్ ఉన్న ప్రతి ఒక్కరిలో వణుకు మొదలవుతుంది. బందీగా ఉన్న అజిత్ ఏం చేస్తాడు? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేదే కథ.

దర్శకుడు వినోత్ ఈ సినిమాను పూర్తిస్థాయి భారీ యాక్షన్ మూవీగానే తీర్చిదిద్దాడు. స్టైలీష్ మేకింగ్ తో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రేక్షకుడిని అంచనాల పద్దతిలో కథలోకి తీసుకుని వెళ్లే ఆలోచన చేయకుండా, హడావిడిగా కథలోకి లాగేశాడు. ఆరంభంలోనే ఏం జరిగిందనే విషయాన్ని టీవీలో వార్తగా చూపించాడు. రీ కార్డింగ్ ఆ వాయిస్ ను డామినేట్ చేయడం వలన, ప్రేక్షకులకు ఏం జరిగిందనేది అర్థం కాదు. ఇలా ఒక రకమైన అయోమయంతోనే ప్రేక్షకుడు కథను ఫాలో అవుతుంటాడు.            
      
'బీస్ట్' సినిమా కథ అంతా కూడా ఒక మాల్ చుట్టూ ఎలా తిరుగుతుందో, ఈ  కథ అంతా కూడా ఒక బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది. హీరో బ్యాంక్ లో ఉండిపోతాడు .. అతనికి సూచనలిస్తూ బయట వ్యాన్లో మంజు వారియర్ ఉంటుంది. మంజువారియర్ ను తీసుకున్నప్పుడే ఈ సినిమాలో రొమాన్స్ .. పాటలు ఉండవని అనుకోవడం సహజం .. నిజంగా కూడా అదే జరిగింది. పోనీ బ్యాంకు లోపల ఏమైనా కామెడీనీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారా అంటే .. అదీ లేదు.

దర్శకుడు కథ విషయంలో సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా క్లారిటీ ఇవ్వలేదు. కథనంలో కూడా ఎక్కడా కొత్తదనం కనిపించదు .. పొరపాటున కూడా ఎలాంటి ట్విస్టులు ఎదురుకావు. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేయడంలోనూ .. వాటిని రిజిస్టర్ చేసే విషయంలోను శ్రద్ధ పెట్టలేదు. ఇలా ఎంతసేపు బ్యాంకులోనే కాల్పులతో సరిపెట్టుకుంటాం .. అలా బయటికి వెళితే హెలికాఫ్టర్లు .. స్పీడ్ బోట్లు వాడొచ్చు, క్లైమాక్స్ కి భారీతనం తీసుకురావొచ్చునని అనుకున్నారేమో అలాగే చేశారు. 

ఇక గిబ్రాన్ ఈ సినిమా కోసం అందించిన పాటల్లో ట్యూన్స్ .. కొరియోగ్రఫీని అర్థం చేసుకోవచ్చుగానీ, తెలుగు సాహిత్యం మాత్రం అర్థం కాదు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ విషయానికొస్తే, కథలో అనూహ్యమైన మలుపులు లేవు కనుక ఆయనకి పెద్ద కష్టం తప్పినట్టే. యాక్షన్ తప్ప ఈ సినిమాలో మరేమీ లేదు. అందువలన ఆ యాక్షన్ సీన్స్ ను .. ముఖ్యంగా సముద్రంలో స్పీడ్ బోట్స్ నేపథ్యంలో సాగే ఛేజింగ్ దృశ్యాలను తన కెమెరాలో నీరవ్ షా అద్భుతంగా బంధించాడు. 

ఈ సినిమా కథలోగానీ ... కథనంలో గాని .. పాత్రలను తీర్చిదిద్దే విధానంలోగాని కొత్తదనం కనిపించదు. ఈ కథకి లవ్ .. రొమాన్స్ వర్కౌట్ కావు. కానీ ఎమోషన్ ను .. కామెడీని కూడా పక్కన పెట్టేశారు.  దర్శకుడే అన్ని వైపుల నుంచి కథను లాక్ చేస్తూ వెళ్లి, ఒక్క యాక్షన్ మాత్రమే ఎవైలబుల్ అనే బోర్డు పెట్టేసినట్టుగా ఉంది. ఖర్చు విషయంలో బోనీ కపూర్ కాంప్రమైజ్ కాలేదు. కానీ ఆ ఖర్చుకు తగిన కథను చెప్పలేకపోయారు. తమిళనాట అజిత్ కి ఉన్న క్రేజ్ పరంగా అక్కడ ఈ సినిమా ఆకట్టుకోవచ్చునేమోగానీ, ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కడం కష్టమే.

More Telugu News