Harish Rao: బండి సంజయ్ చెప్పినట్టే నోటీసులు వచ్చాయి: హరీశ్ రావు మండిపాటు

ED notices came as Bandi Sanjay told says Harish Rao

  • రోహిత్ రెడ్డికి నోటీసులు వస్తాయని రెండు రోజుల క్రితమే సంజయ్ చెప్పారన్న హరీశ్
  • కేంద్రం వల్లే ఉద్యోగులకు వేతనాలు ఆలస్యమవుతున్నాయని మండిపాటు
  • జేపీ నడ్డా సొంత రాష్ట్రంలోనే బోర్లా పడ్డారని ఎద్దేవా

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, బీజేపీపై మండిపడ్డారు. రోహిత్ రెడ్డికి నోటీసులు వస్తాయని రెండు రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే నోటీసులు వచ్చాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఉద్దేశపూర్వకంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని విమర్శించారు. 

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని హరీశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడానికి కూడా కేంద్రమే కారణమని ఆరోపించారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల వల్లే వేతనాలివ్వడం ఆలస్యమవుతోందని చెప్పారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు సక్రమంగా ఇస్తే ఉద్యోగులకు నిరాటంకంగా జీతాలు ఇస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ ఆరోపించడం సరికాదని చెప్పారు. 

ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో బోర్లా పడ్డ నడ్డా... తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెపుతారని అన్నారు. ప్రతి శాఖకు సంబంధించి కేంద్రం నుంచి తెలంగాణకు అవార్డులు వస్తున్నాయని... ఢిల్లీలో అవార్డులు ఇస్తూ, గల్లీల్లో విమర్శలు చేయడం కాషాయ పార్టీకి అలవాటుగా మారిందని హరీశ్ రావు దుయ్యబట్టారు.

Harish Rao
Rohit Reddy
ED Notice
Drugs Case
Bandi Sanjay
BJP
  • Loading...

More Telugu News