KTR: అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 70కి, డీజిల్ రూ. 60కే ఇవ్వొచ్చు: కేటీఆర్

TS Minister KTR urges Centre to scrap cess on fuel to reduce prices
  • పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాలు వ్యాట్ వేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
  • పార్లమెంటులో రాష్ట్రాలను నిందించడంపై కేటీఆర్ ఆగ్రహం
  • సెస్ వెత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ మంత్రి 
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెట్రోలియం ఉత్పత్తులపై విధించిన సెస్‌ను ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధరలను తగ్గించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు. కేంద్రం సెస్ ను ఎత్తివేస్తే లీటరు పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.70, రూ.60కి తగ్గించవచ్చని చెప్పారు. 

ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించనందుకు తెలంగాణ, ఇతర ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం నిందించడంపై ఆయన స్పందించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించలేదని లోక్‌సభలో పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తే వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు. 

ఈ రాష్ట్రాల్లోని ప్రజలు తమ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వ్యాట్‌ను విధిస్తూనే ఉన్నందున ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. కేంద్ర మంత్రికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎన్‌పీఏ (నాన్‌ పెర్‌ఫార్మింగ్‌ అలయన్స్‌-పని చేయని కూటమి) ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరిగాయని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. తాము ఒక్కసారి కూడా కూడా వ్యాట్ పెంచకపోయినా.. ఇలా పార్లమెంటులో రాష్ట్రాల పేర్లు పేర్కొనడంపై అసహనం వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీ  చెప్పే సమాఖ్య స్పూర్తి అంటే ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ 2014 నుంచి ఇంధనంపై వ్యాట్‌ను పెంచలేదని, ఒక్కసారి మాత్రమే రౌండాఫ్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ ఎన్‌పీఏ ప్రభుత్వం విధించిన సెస్‌ కారణంగా మాకు వచ్చే వాటాలో 41 శాతాన్ని పొందలేకపోతున్నాం. సెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 30 లక్షల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది సరిపోదా?దయచేసి సెస్‌ను రద్దు చేయండి. అప్పుడు పెట్రోలు రూ. 70, డీజిల్ రూ. 60 కే అందించి భారతీయులందరికీ ఉపశమనం కలిగించగలం‘ అని కేటీఆర్ వరస ట్వీట్లు చేశారు.
KTR
Telangana
BJP
FUEL
petrol
diesel
prices
cess

More Telugu News