Arjun Tendulkar: భళా అర్జున్ టెండూల్కర్... మొదటి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ

Arjun Tendulkar hits ton in his debut Ranji Trophy match

  • పోర్వోరిమ్ లో గోవా వర్సెస్ రాజస్థాన్
  • రంజీ ట్రోఫీ ఎలైట్ విభాగం గ్రూప్-సిలో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ కు దిగిన గోవా
  • 120 పరుగులు చేసిన అర్జున్ టెండూల్కర్
  • బౌలర్ గా గోవా జట్టుకు ఎంపికైన సచిన్ తనయుడు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేశాడు. గోవా రంజీ టీమ్ తరఫున దేశవాళీ బరిలో దిగిన అర్జున్ టెండూల్కర్ రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్ లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఏడోస్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అర్జున్ 207 బంతుల్లో 120 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 16 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 

కాగా, సచిన్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీతో ఔరా అనిపించాడు. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచి మొదటి మ్యాచ్ తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. అయితే సచిన్ ఈ ఘనత 15 ఏళ్ల వయసులో సాధించగా, అర్జున్ 23 ఏళ్ల వయసులో సాధించాడు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అర్జున్ టెండూల్కర్ ప్రధానంగా లెఫ్టార్మ్ పేస్ బౌలర్... బౌలర్ గానే అతడు గోవా జట్టుకు ఎంపికయ్యాడు. అయితే బ్యాటింగ్ లో తన ప్రతిభ నిరూపించుకుని టీమిండియా దిశగా తొలి అడుగును ఘనంగా వేశాడు. 

ఈ మ్యాచ్ విషయానికొస్తే రంజీ ట్రోఫీ ఎలైట్ విభాగం గ్రూప్-సిలో భాగంగా గోవా, రాజస్థాన్ జట్లు పోర్వోరిమ్ లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, గోవా బ్యాటింగ్ కు దిగింది. తొలి రోజు ఆటలో 4 పరుగులతో క్రీజులో ఉన్న అర్జున్ టెండూల్కర్ రెండోరోజు ఆటలో బ్యాట్ ఝుళిపించాడు. 

అనికేత్ చౌదరి, కమలేశ్ నాగర్ కోటి, మహిపాల్ లోమ్రోర్ వంటి ప్రతిభావంతులతో కూడిన రాజస్థాన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్నాడు. గోవా ఇన్నింగ్స్ లో అర్జున్ కు సుయాష్ ప్రభుదేశాయ్ నుంచి చక్కని సహకారం అందింది. ప్రభుదేశాయ్ (212) ఈ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించడం విశేషం. మొత్తమ్మీద ప్రభుదేశాయ్, అర్జున్ టెండూల్కర్ ల చలవతో గోవా రెండో రోజు ఆట చివరికి తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 493 పరుగులు చేసింది. 

ప్రభుదేశాయ్ డబుల్ సాధించినప్పటికీ ఈ మ్యాచ్ లో హైలైట్ అంటే అర్జున్ టెండూల్కర్ ఇన్నింగ్సే అని చెప్పాలి. ఆడుతున్నది తొలి రంజీ మ్యాచ్... పైగా ఏడోస్థానంలో బ్యాటింగ్ కు రావడం... తండ్రి సచిన్ పేరు ప్రఖ్యాతులు కారణంగా నెలకొన్న ఒత్తిడి... వీటన్నింటి నేపథ్యంలో అర్జున్ ఇన్నింగ్స్ కు విశిష్టత ఏర్పడింది. 

కెరీర్ తొలి దశలో బౌలర్ గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ ఇటీవల క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వద్ద బ్యాటింగ్ లో శిక్షణ పొందుతున్నాడు. చండీగఢ్ లోని యోగరాజ్ సింగ్ అకాడమీలో ఉంటూ తన బ్యాటింగ్ కు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఆ శిక్షణ సత్ఫలితాలను ఇచ్చిందనడానికి నేటి సెంచరీయే నిదర్శనం. 

అర్జున్ టెండూల్కర్ సొంతగడ్డ ముంబయి అయినప్పటికీ, ముంబయి రంజీ టీమ్ లో స్థానానికి గట్టిపోటీ ఉండడంతో అతడు గోవాకు తరలి వెళ్లడం తెలిసిందే.

Arjun Tendulkar
Century
Ranji Trophy
Goa
Rajasthan
Sachin Tendulkar
Team India
  • Loading...

More Telugu News