Vitamin B12: విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారా... ఆ విషయం మీ నడక చెప్పేస్తుంది!

Vitamin B12 deficiency can caused unsteady in walking

  • పోషకాల లోపంతో అనారోగ్యాలు
  • ముఖ్యంగా బి12 విటమిన్ లోపంతో తీవ్ర పరిణామాలు
  • నాడీ వ్యవస్థ దెబ్బతింటుందన్న నిపుణులు 
  • నడకలో తేడా వస్తుందని వెల్లడి

పోషకాహార లోపం తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విటమిన్ బి12 లోపిస్తే కలిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. మనిషి మెదడు, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

శరీరంలో డీఎన్ఏ నిర్మాణంలోనూ, రక్తకణాల వృద్ధిలోనూ ప్రధాన పాత్ర బి12 విటమిన్ దే. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్ ఏదంటే విటమిన్ బి12 అని వైద్య నిపుణులు చెబుతుంటారు. బ్రిటన్ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్ హెచ్ఎస్) విటమిన్ బి12కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. 

బి12 లోపాన్ని మొదట్లోనే గుర్తిస్తే నయం చేయడం సులువేనని, కానీ దీన్ని పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తే నరాలకు సంబంధించిన సమస్యల బారినపడతారని హెచ్చరించింది. ఒక్కసారి నరాల రుగ్మతలు తలెత్తితే ఈ లోపాన్ని నయం చేయలేమని పేర్కొంది. 

నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో శరీరం మొత్తం నియంత్రణ కోల్పోతుందని, మాట్లాడడంలో, నడకలో తడబాటు కనిపిస్తుందని, నడక అస్థిరంగా ఉంటుందని, అడుగులు ఎడంగా పడుతుంటాయని ఎన్ హెచ్ఎస్ వివరించింది. పాదాల కదలికల్లో సమన్వయం కొరవడుతుందని వెల్లడించింది. 

హార్వర్డ్ యూనివర్సిటీ ఆరోగ్య విభాగం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుకపై పుండ్లు, చేతుల్లో వణుకు వంటి లక్షణాలు కూడా బి12 లోపానికి సంకేతాలని వెల్లడించింది. మనిషి నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోతాడని తెలిపింది. 

ఇటువంటి సమస్యలు కనిపిస్తే రక్త పరీక్ష ద్వారా విటమిన్ బి12 లోపాన్ని గుర్తించవచ్చని, ఆపై రెండు మార్గాల్లో అధిగమించవచ్చని వివరించింది. విటమిన్ లోపం తీవ్రతను బట్టి వారానికోసారి బి12 ఇంజెక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే ప్రతిరోజూ అధిక డోసు కలిగిన బి12 మాత్రలు తీసుకోవాలని పేర్కొంది. బి12 విటమిన్ లోపం ఓ మోస్తరు స్థాయిలో ఉంటే మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకున్నా సరిపోతుందని హార్వర్డ్ ఆరోగ్య విభాగం వెల్లడించింది.

Vitamin B12
Deficiency
Walking
Symptoms
Health
  • Loading...

More Telugu News