Maruti Suzuki: జనవరి నుంచి పెరగనున్న మారుతి కార్ల ధరలు

Maruti Suzuki cars prices will hike from 2023 January

  • పెరిగిన ఉత్పాదక వ్యయం
  • ప్రభావం చూపుతున్న చిల్లర ద్రవ్యోల్బణం
  • ఇంధన సామర్థ్య ప్రమాణాలు కఠినంగా ఉన్నాయన్న మారుతి
  • ధరలు పెంచక తప్పడంలేదని వెల్లడి

భారత్ లో అగ్రశ్రేణి కార్ల తయారీదారు మారుతి సుజుకి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. 2023 జనవరి నుంచి ధరల పెంపు అమల్లోకి రానుంది. ద్రవ్యోల్బణం, పలు నిబంధనల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుండంతో మారుతి సుజుకి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

దేశంలో వార్షిక చిల్లర ద్రవ్యోల్బణం గత అక్టోబరులో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయి 6.77 శాతంగా నమోదైంది. ఇది ఊరట కలిగించే అంశమే అయినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 6 శాతం సహన స్థాయికంటే ఎక్కువగానే ఉంది. 

పైగా కేంద్రం ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కార్ల తయారీదారులు ఇంధన సామర్థ్య ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని హుకుం జారీ చేసింది. వాతావరణంలో కర్బన ఉద్గారాల పరిమాణాన్ని తగ్గించే కార్యాచరణలో భాగంగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. 

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే కార్ల ఉత్పాదక వ్యయం తడిసి మోపెడవుతోందని మారుతి సుజుకి యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నప్పటికీ, ధరల పెంపు తప్పడం లేదని వివరించింది. భారత మార్కెట్లో మారుతి సుజుకి వాటా 40 శాతం ఉంది. కాగా, కార్ల ధరలను ఎంత మేర పెంచనున్నారన్న విషయాన్ని మారుతి తన ప్రకటనలో వెల్లడించలేదు.

Maruti Suzuki
Cars
Price
Hike
India
  • Loading...

More Telugu News