Adivi Sesh: మూవీ రివ్యూ: 'హిట్ 2'

HIT 2 Movie Review
  • ఈ రోజునే విడుదలైన 'హిట్ 2'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • సీరియల్ కిల్లర్ కోసం వేట 
  • రొటీన్ కి భిన్నంగా లేని కథాకథనాలు
  • వన్ మేన్ షోగా తనదైన మార్క్ చూపించిన అడివి శేష్  

తెలుగు తెరపైకి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథలు చాలానే వచ్చాయి. సాధారణంగా ఈ జోనర్లో రూపొందిన సినిమాలకి యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ఎక్కువగా వస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ రావడం చాలా తక్కువనే చెప్పాలి. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఇష్టపడే ఈ తరహా జోనర్ లో, కంటెంట్ డిఫరెంట్ గా ఉండటం వలన మంచి వసూళ్లను రాబట్టినవి కూడా ఉన్నాయి. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తాజాగా వచ్చిన సినిమానే 'హిట్ 2'. 

అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా మీనాక్షి చౌదరి నటించింది. నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 'మేజర్'తో విజయాన్ని అందుకున్న అడివి శేష్ నుంచి వచ్చిన సినిమాగా .. నాని చేసిన పబ్లిసిటీ కారణంగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. అలాంటి ఈ సినిమా ఎంతవరకూ అంచనాలను అందుకుందన్నది చూద్దాం. 

ఈ కథ వైజాగ్ లో మొదలవుతుంది .. ఒక బార్ లో పనిచేసే సంజన అనే యువతి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమె తల .. కాళ్లు .. చేతులు శరీరం నుంచి వేరు చేయబడతాయి. ఆ హత్యకేసు ఎస్పీ కృష్ణదేవ్ (అడివి శేష్) కి అప్పగించబడుతుంది. అప్పటికే అతను 'ఆర్య' (మీనాక్షి చౌదరి) ప్రేమలో ఉంటాడు. ఆమెతో సహజీవనం చేస్తుంటాడు. 'మ్యాక్స్' అనే ట్రైనింగ్ డాగ్ ఎప్పుడూ అతని కూడా ఉంటూ ఉంటుంది. 

బార్ లో చనిపోయిన యువతి 'తల' భాగం మాత్రమే ఆమెకి సంబంధించినదనీ, కాళ్లు .. చేతులు ఇతర యువతులకు సంబంధించినవనే రిపోర్టు రావడంతో కృష్ణదేవ్ ఉలిక్కి పడతాడు. తాము పట్టుకోవలసింది సీరియల్ కిల్లర్ ను అనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? వరుస హత్యల హంతకుడిని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు? అసలు హంతకుడు ఎవరు? ఎందుకోసం హంతకుడిగా మారాడు? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది. 

'హిట్ 1' సినిమాను తెరకెక్కించిన శైలేశ్ కొలను, అదే బ్యానర్లో 'హిట్ 2' సినిమాను రూపొందించాడు. 'హిట్ 1' కథకి సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఆ కథకే వదిలేసి, 'హిట్ 2' లో శైలేశ్ కొలను కొత్త కేసును ఎంచుకున్నాడు. ఆ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ ను తీసుకున్నాడు. అడివి శేష్ సినిమా అంటే ఏదో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అందువల్లనే ఈ రోజున థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. 

కానీ శైలేశ్ కొలను రాసుకున్న కథలోగానీ .. అల్లుకున్న కథనంలోగాని కొత్తదనం ఎక్కడా కనిపించదు. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథలు ఈ ఫార్మేట్ లో నుంచి బయటికి రాకూడదు అన్నట్టుగానే ఈ కథ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఒకటి రెండు పాత్రలపై అనుమానం కలిగేలా చేసి, అప్పటివరకూ తెరపైనే కనిపిస్తూ .. ఏ మాత్రం అనుమానం కలగని ఓ పాత్రని క్లైమాక్స్ లో రివీల్ చేస్తుంటారు. అదే ఫార్మేట్ ను పక్కాగా ఫాలో అయిన సినిమా ఇది. 

ఇక వరుస హత్యలు చేసే సైకోను పట్టుకోవడానికి హీరో రంగంలోకి దిగితే, ఆ సైకో ఊర్కుంటాడా? హీరోయిన్ విషయంలో హీరోను నానా టెన్షన్ పెట్టేస్తాడు. శైలేశ్ కొలను చూపించింది కూడా ఇదే.  ఏ క్షణంలో సైకో ఏ వైపు నుంచి హీరోయిన్ పై దాడి చేస్తాడో అని హీరో టెన్షన్ పడుతూ ఉంటాడేగానీ, లంకంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమెను ఎక్కడికైనా దూరంగా పంపించాలని మాత్రం అనుకోడు. 

ఇక ఈ కథ రామ్ ప్రసాద్ (హర్షవర్ధన్) ఫ్యామిలీ ఎపిసోడ్ తో మొదలవుతుంది. అందరి దృష్టిని ఈ వైపు మళ్లించి, మరో వైపు నుంచి సస్పెన్స్ ను రివీల్ చేస్తే బాగుంటుందని దర్శకుడు భావించాడు. కానీ హర్షవర్ధన్ ఎపిసోడ్ ను ముందుగా చూపించడమే మైనస్ అయింది. అలాగే అభిలాష్ (శ్రీకాంత్ మాగంటి) పాత్ర ఎంట్రీ .. అతనితో శ్రీకాంత్ అయ్యంగార్ కి జరిగిన సంభాషణ విషయంలో క్లారిటీ లోపించింది. 

ఈ సినిమాలో అడివి శేష్ కి పైఅధికారి స్థానంలో రావు రమేశ్ కనిపిస్తాడు. అలాగే మరో ఆఫీసర్ గా మధు సూదన్ కనిపిస్తాడు. సీనియర్ జర్నలిస్ట్ గా పోసాని కనిపిస్తాడు. కానీ ఈ పాత్రలేవీ సరిగ్గా డిజైన్ చేయడం జరగలేదు. హీరో పాత్ర మాత్రమే తెరపై యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అందువలన అడివి శేష్ పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ తేలిపోతాయి. హీరోకి అసిస్టెంట్ గా ఉన్న కోమలి ప్రసాద్ పాత్ర కొంతవరకూ బెటర్. 

అడివి శేష్ బాడీ లాంగ్వేజ్ .. ఆయన ఈ పాత్రను స్టైలీష్ గా నడిపించిన తీరే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఈ కేసులో సంజన ఫ్రెండ్ రాఘవుడిని దోషిగా భావించి అతణ్ణి కృష్ణదేవ్ అరెస్టు చేయడం, అసలు నేరస్థుడు అతను కాదని తెలుసుకుని ఎన్ కౌంటర్ ను ఆపేందుకు ప్రయత్నించే ఎపిసోడ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. 

పాటల పరంగా చూసుకుంటే శ్రీలేఖ స్వరపరిచిన 'ఉరికే ఉరికే' పాట బాగుంది. విజువల్స్ పరంగా కూడా ఈ పాట ఆకట్టుకుంటుంది. మణికందన్ ఫొటోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. జాన్ స్టీవర్ట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి ఉపయోగపడింది. గ్యారీ బీ హెచ్ ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువల పరంగా వంకబెట్టవలసిన పనిలేదు. 

ఇంతకుముందు వచ్చిన సైకో కిల్లర్ కథలకు ఈ సినిమా ఏ మాత్రం భిన్నంగా అనిపించదు. హింస .. రక్తపాతాలను సైతం క్లోజప్ షాట్స్ లో చూపించారు. సంగీతం ... ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రమే కాస్త కొత్తదనం కనిపిస్తుంది. వన్ మేన్ షో తరహాలో అడివి శేష్ తనదైన మార్క్ చూపుతూ చేసిన స్టైలీష్ యాక్టింగ్ మాత్రమే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చివరిలో, 'హిట్ 3'లో పోలీస్ ఆఫీసర్ 'అర్జున్ సర్కార్'గా నానీని రివీల్ చేయడం కొస మెరుపు.

  • Loading...

More Telugu News