Pakistan: ఆసియాకప్‌లో ఆడేందుకు భారత్ రాకుంటే..: రమీజ్ రాజా సంచలన కామెంట్స్!

Ramiz Raja Confirms Plans For ODI World Cup 2023
  • వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియాకప్ 
  • ఆ తర్వాత ఇండియాలో వన్డే ప్రపంచకప్
  • పాకిస్థాన్ లేకుండా జరిగే ప్రపంచకప్‌లను ఎవరు చూస్తారన్న రమీజ్ రాజా
  • భారత్‌ను ఒకే ఏడాదిలో రెండుసార్లు ఓడించామన్న పాక్ క్రికెట్ బోర్డు చీఫ్
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌లో ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు కనుక రాకుంటే భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ కోసం తాము కూడా రాబోమని నొక్కి చెప్పాడు. 

పాకిస్థాన్ గత రెండు సంవత్సరాలుగా నాణ్యమైన క్రికెట్ ఆడుతోందన్న రమీజ్ రాజా.. 2021 ప్రపంచకప్, ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌లలో భారత్‌ను పాకిస్థాన్ రెండు సార్లు ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆసియాకప్ కోసం భారత జట్టు కనుక పాకిస్థాన్ వెళ్లకూడదని అనుకుంటే అప్పుడు తమ వైఖరి కూడా కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నాడు. 

వారు (భారత జట్టు) కనుక ఆసియాకప్ కోసం పాకిస్థాన్ వస్తే, అప్పుడు తాము ప్రపంచకప్ కోసం భారత్ వస్తామని, ఈ విషయంలో తమ వైఖరి సుస్పష్టమని రమీజ్ పేర్కొన్నాడు. వారు కనుక రాకపోతే పాకిస్థాన్ లేకుండానే ప్రపంచకప్ ఆడుకోవచ్చన్నాడు. అదే జరిగితే పాకిస్థాన్ లేని ప్రపంచకప్‌ను ఎవరు చూస్తారని ప్రశ్నించాడు. తమ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోందన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాన్ని సృష్టించే జట్టును తాము ఓడించామన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ ఆడామని రమీజ్ గుర్తు చేశాడు. 

పాకిస్థాన్ క్రికెట్‌ను ఆర్థికంగా మెరుగుపరచాలని భావిస్తున్నట్టు తాను చెబుతూ ఉంటానని, తమ జట్టు అద్భుతంగా ఆడినప్పుడే అది సాధ్యమవుతుందని పాక్ బోర్డు చీఫ్ చెప్పుకొచ్చాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అది చేసి చూపించామన్నాడు. బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన బోర్డు జట్టును ఒకే ఏడాది రెండుసార్లు ఓడించామని గర్వంగా పేర్కొన్నాడు. 

కాగా, పాకిస్థాన్ చివరిసారి 2009లో ఆసియాకప్‌కు ఆతిథ్యమిచ్చింది. ఆ ఏడాది పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరగడంతో ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్‌లో పర్యటించడం మానుకున్నాయి. 2015లో జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్‌లో అడుగుపెట్టడంతో ఆ దేశంలో తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలయ్యాయి. 2017లో శ్రీలంక జట్టు ఒకే ఒక్క వన్డే కోసం పాకిస్థాన్‌లో పర్యటించి పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు తనవంతు సాయం చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా సహా పలు దేశాలు పాకిస్థాన్‌లో పర్యటించాయి. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. డిసెంబరు 1 నుంచి పర్యటన ప్రారంభమవుతుంది.
Pakistan
Team India
Asia Cup
One Day World Cup
BCCI

More Telugu News