Malla Reddy: మల్లారెడ్డి కుమారుడికి ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు

Minister Malla Reddy son suffered from chest pain

  • మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
  • మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్ గా ఉన్న కుమారుడు మహేందర్ రెడ్డి
  • సోదాల నేపథ్యంలో నిన్న ఇంట్లోనే ఉన్న మహేందర్  

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సూరారంలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, కుమార్తె, అల్లుడు, వియ్యంకుడి ఇళ్లలో నిన్న ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోదాల నేపథ్యంలో నిన్న మహేందర్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. 

మరోవైపు ఈరోజు కూడా వీరి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. నిన్న రాత్రి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వారి ఇళ్లలోనే పడుకున్నారు. నిన్నటి సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ. 4 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. 

మరోవైపు ఈ దాడులకు ముందురోజే ప్రధాని మోదీపై మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత దేశ ప్రధాని కేసీఆరే అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఐటీ దాడులు ప్రారంభం కావడం గమనార్హం.

Malla Reddy
Son
Mahender Reddy
Chest Pain
  • Loading...

More Telugu News