Amzad Basha: చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు అవకాశం ఇవ్వరు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

Dy CM Amzad Basha fires on TDP Chief Chandrababu

  • కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • విమర్శనాస్త్రాలు సంధించిన డిప్యూటీ సీఎం
  • చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే హక్కులేదని వెల్లడి
  • చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి అంటూ విమర్శలు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటించే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. రాయలసీమ వ్యతిరేకి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబేనని అన్నారు. 

చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, రాయలసీమలో రాజకీయంగా ఎదిగి, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ, రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు, రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఏనాడూ రైతుల గురించి ఆలోచించకుండా, వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నాడని అంజాద్ బాషా మండిపడ్డారు. 

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు మరొక్క అవకాశం అంటున్నాడని, ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతున్నాడని విమర్శించారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, కానీ తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారు. 

"ప్రజలు 14 ఏళ్లు నిన్ను చూశారు. నువ్వు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక నువ్వు చేసిన పనులకు ఎక్కడా పొంతనలేదని ప్రజలు గుర్తించారు" అంటూ అంజాద్ బాషా తీవ్రస్థాయిలో స్పందించారు.

Amzad Basha
Chandrababu
Rayalaseemmma
Kurnool District
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News