Pavala Shyamala: దీనస్థితిలో టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల

Miserable life of Tollywood senior actress Pavala Shyamala

  • గుండె జబ్బుతో బాధపడుతున్న శ్యామల
  • కాలు విరిగి మంచానపడిన కుమార్తె
  • కుమార్తెతో కలిసి వృద్ధాశ్రమంలో బతుకీడుస్తున్న శ్యామల
  • అనాథల్లా బతుకుతున్నామని కన్నీటిపర్యంతం

వందల చిత్రాల్లో కామెడీ, క్యారెక్టర్ రోల్స్ లతో అలరించిన టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల ఇప్పుడెలా ఉందో చూస్తే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఓ ప్రమాదంలో కాలు విరిగి మంచాన పడిన కూతురు సహా ఆమె ఓ వృద్ధాశ్రమంలో దయనీయ స్థితిలో బతుకీడుస్తున్నారు. 

వయసు మీదపడిన స్థితిలో సంపాదన లేక, చేతిలో డబ్బు లేని పరిస్థితుల్లో పావలా శ్యామలను అనారోగ్యం సైతం వేధిస్తోంది. ఆమె కొన్నాళ్ల కిందట గుండెపోటుకు గురికాగా, గుండెకు రంధ్రాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు చెప్పినా, డబ్బు లేక మందులతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పుడామె భవిష్యత్ ఏమిటో తెలియని దుర్భరస్థితిలో దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం కూతుర్నయినా కాపాడుకోవాలని తపిస్తున్నారు. 

పావలా శ్యామల భర్త గతంలో ఓ రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆ తర్వాత కుమార్తెతో కలిసి జీవనం ప్రారంభించారు.  మూడేళ్ల క్రితం పావలా శ్యామల కుమార్తె కిందపడడంతో కాలు విరిగిపోయింది. దాంతో మంచానికే పరిమితమైంది. అటు మంచాన ఉన్న కుమార్తె, ఇటు తన గుండె సమస్యతో పావలా శ్యామలను కొండంత కష్టం చుట్టుముట్టింది. 

ఓసారి పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె శ్రీజ ద్వారా రూ.2 లక్షల మేర ఆర్థికసాయం చేశారు. ఆ తర్వాత ఆమె 'మా'లో సభ్యత్వం పొందేందుకు వీలుగా రూ.1,01,500 అందించారు. 

అయితే, పావలా శ్యామల ఎవరైనా సాయం చేసేందుకు వస్తే వారి సాయం తిరస్కరిస్తోందన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. దీనిపై పావలా శ్యామల స్పందిస్తూ, కరాటే కల్యాణి తన గురించి తప్పుగా ప్రచారం చేసిందని వెల్లడించారు. సాయం చేస్తానంటే తాను ఎవరినీ వద్దనలేదని స్పష్టం చేశారు. తనకు చిరంజీవి ఎంతో సాయపడ్డారని వివరించారు. తమకు ఎవరూ లేకపోగా ఇప్పుడు తాను, తన కూతురు అనాథల్లా వృద్ధాశ్రమంలో బతుకుతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Pavala Shyamala
Actress
Poverty
Tollywood
  • Loading...

More Telugu News