Andhra Pradesh: మీ వల్లే మాకు చెడ్డ పేరు.... అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే అసహనం

ysrcp mla satti suryanarayana fires over officers

  • జగన్ ను చెడుగా చిత్రీకరించేందుకు అధికారులు యత్నిస్తున్నారేమోనన్న ఎమ్మెల్యే సత్తి
  • ధాన్యం కొనుగోళ్లను వలంటీర్లకు ఎలా అప్పగిస్తారని అధికారులను నిలదీసిన వైనం
  • ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుందని చురకలు

అధికారులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అసలు మీ వల్లే మాకు చెడ్డ పేరు వస్తోందని ఆయన అధికారుల ముందే మండిపడ్డారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే... రైతులతో కలిసి అధికారులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగుతానని కూడా ఆ ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తో కలిసి తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే... అధికారులపై మండిపడ్డారు. అధికారులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. 

అయినా ధాన్యం కొనుగోళ్లను వలంటీర్లకు ఎలా అప్పగిస్తారని, అసలు వలంటీర్లకు ఏం తెలుసునని సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. జగన్ ను ప్రజల్లో చెడుగా చిత్రీకరించేందుకే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమోనన్న అనుమానాలూ కలుగుతున్నాయన్నారు. ఆర్బీకే పరిధిలో నాలుగైదు వందల మంది రైతులు ఉంటే... వారందరి ధాన్యం కొనుగోళ్లను నలుగురైదుగురు వలంటీర్లకు ఎలా అప్పగిస్తారన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారమైతే సరేసరి... లేదంటే అధికారుల తీరుకు నిరసనగా రైతులతో కలిసి తాను ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News