Budi Mutyala Naidu: అయ్యన్నపాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు కాబట్టే అరెస్ట్ చేశారు: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

Mutyala Naidu fires on TDP leaders over Ayyanna arrest

  • ఫోర్జరీ పత్రాల కేసులో అయ్యన్న అరెస్ట్
  • మండిపడుతున్న టీడీపీ నేతలు
  • అయ్యన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారన్న ముత్యాలనాయుడు
  • టీడీపీ నేతలు ఓటమిభయంతో మాట్లాడుతున్నారని విమర్శలు 

నర్సీపట్నంలో తన నివాసం గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారన్న కేసులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయ్యన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పందించారు. 

అయ్యన్న అడ్డంగా దొరికిపోయాడు కాబట్టే అరెస్ట్ చేశారని ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని, ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని సీఐడీ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎవరినీ అన్యాయంగా అరెస్ట్ చేయించడంలేదని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీ నేతలు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అయ్యన్న అరెస్ట్ విషయంలో కులం పేరిట సానుభూతి పొందాలని చూస్తున్నారని, అయ్యన్నను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే బీసీలకు ఏంటి సంబంధం అని ముత్యాలనాయుడు ప్రశ్నించారు. తాను చేసిన నేరాన్ని అయ్యన్న బీసీలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని పేర్కొన్నారు. 

అయ్యన్నను చట్ట ప్రకారమే అరెస్ట్ చేస్తే, ఓ వర్గం మీడియా తప్పుగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అయ్యన్న వంటి వ్యక్తి ఫోర్జరీ వంటి దొంగపనులకు పాల్పడవచ్చా? అని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు నిలదీశారు. అరెస్టులు అక్రమం అంటున్న టీడీపీ నేతలు అందుకు ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించాలని హితవు పలికారు.

Budi Mutyala Naidu
Ayyanna Patrudu
Arrest
TDP Leaders
YSRCP
  • Loading...

More Telugu News