Ayyanna Patrudu: దుస్తులు కూడా మార్చుకోనివ్వలేదు.. అయ్యన్న అరెస్ట్‌పై ఆయన భార్య పద్మావతి

Chintakayala padmavati slams police
  • ఈ తెల్లవారుజామున అయ్యన్నను అరెస్ట్ చేసిన పోలీసులు
  • చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా తోసుకుంటూ వెళ్లారన్న పద్మావతి
  • అయ్యన్న అరెస్ట్‌ను ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా అభివర్ణించిన పల్లా శ్రీనివాసరావు
ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయ్యన్న అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఖండించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

తాజాగా, అయ్యన్న భార్య పద్మావతి మాట్లాడుతూ.. తన భర్తకు దుస్తులు మార్చుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదని, చెప్పులు కూడా వేసుకునే సమయం ఇవ్వకుండా తోసుకుంటూ వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని మూడేళ్లుగా వేధిస్తోందని అన్నారు. మరోవైపు అయ్యన్న అరెస్టును టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. ఆయన అరెస్టును ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Ayyanna Patrudu
TDP
Chintakayala Padmavati
Srinivasa Rao

More Telugu News