Pawan Kalyan: నేడు నాగబాబు పుట్టినరోజు... శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Nagababu on his birthday

  • తన జీవితంలో నాగబాబుకు ప్రత్యేకస్థానం ఉందన్న పవన్
  • స్వతహాగా న్యాయవాది అని వెల్లడి
  • తనకు అనేక పుస్తకాలను పరిచయం చేశాడన్న జనసేనాని
  • సామాజిక అంశాలపై ఆసక్తి చూపేవాడని వివరణ

మెగాబ్రదర్ నాగబాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగబాబుకు ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభకాంక్షలు తెలిపారు. అంతేకాదు, నాగబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా వెల్లడించారు. "నా జీవనయానంలో ఒక ప్రత్యేకస్థానం ఉన్న మా చిన్నన్నయ్య, జనసేన పీఏసీ సభ్యులు నాగబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషించుకునేటప్పుడు వాటి తాలూకు నేపథ్యాలను, చారిత్రక కోణాలను వాస్తవిక దృక్పథంతో అవగాహన చేసుకోవడం గురించి తనకు తెలియచెప్పింది చిన్నన్నయ్య నాగబాబేనని పవన్ వెల్లడించారు. ప్రఖ్యాత న్యాయకోవిదులు నానీ పాల్కీవాలా ఔన్నత్యం గురించి, రాజ్యాంగం, మన న్యాయవ్యవస్థపై ఆయన రాసిన పుస్తకాల గురించి తనకు పరిచయం చేసింది నాగబాబేనని తెలిపారు. 

స్వతహాగా నాగబాబు న్యాయవాది కావడంతో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు తదితర అంశాలపై ఆసక్తి చూపేవారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావరణ విధ్వంసం వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడేవారని తెలిపారు. పీడిత వర్గాల బాధలకు చలించిపోయేవారని వివరించారు. 

"నెల్లూరులో చదువుకునే రోజుల్లో చిన్నన్నయ్య మద్రాస్ లోని 'హిగ్గిన్ బాథమ్స్' బుక్ స్టాల్ నుంచి తెచ్చిన '100 గ్రేట్ లైవ్స్' అనే పుస్తకాన్ని ఇచ్చి తప్పకుండా చదవమన్నారు. అదేకాదు, అంబేద్కర్, వీరసావర్కర్, భగత్ సింగ్, టైగర్ జతిన్ దాస్, చిట్టగాంగ్ తిరుగుబాటుదారులు, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి... ఇలా సమాజాన్ని భిన్నకోణాల్లో ప్రభావితం చేసిన జీవితగాథలను తెలిపే రచనలను, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చారు. 

చిన్నన్నయ్య ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రక కల్పనా సాహిత్యం బాగా చదివేవారు. దానిపై చర్చించేవారు కూడా. గద్దర్ విప్లవ గీతాలు, కోడిబాయే లచ్చమ్మది... కోడిపుంజుబాయే లచ్చమ్మది వంటి జానపదాల గురించి చెప్పేవారు" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

నాగబాబులో మంచి చిత్రకారుడు కూడా ఉన్నాడని, చదువుకునే రోజుల్లో కరాటే కూడా ప్రాక్టీస్ చేశాడని తెలిపారు. ఇప్పటికీ ఆయన ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని తపిస్తారని పేర్కొన్నారు. నాగబాబు ప్రకృతి వైద్యంలో చెప్పిన అంశాలను పాటిస్తారని, కేవలం తేనె, నిమ్మరసం తీసుకుంటూ రోజుల తరబడి ఉంటారని పవన్ కల్యాణ్ వివరించారు. 

నాస్తికవాదం, ఆస్తికత్వం... ఏదైనా హేతుబద్ధతతో ఆలోచన చేయాలని చెబుతారని, ఈ విధంగా, చిన్నన్నయ్యలో భిన్న పార్శ్యాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే నాగబాబు అన్నయ్యకి ఈ జన్మదినం సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan
Nagababu
Birthday
Janasena
Tollywood
  • Loading...

More Telugu News