Rajinikanth: లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్

Rajinikanth will do two film under Lyca Productions

  • లైకాతో రజనీ భారీ డీల్
  • నవంబరు 5న పూజా కార్యక్రమాలు
  • ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీ

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండు కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ పతాకంపై రెండు భారీ చిత్రాల్లో నటించనున్నారు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్ గతంలో రోబో 2.0 చిత్రంలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పుడదే బ్యానర్లో రజనీ మరోసారి నటించనున్నారు.

లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ్ కుమరన్ దీనిపై స్పందిస్తూ, రజనీతో తాము రెండు సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవం నవంబర్ 5న చెన్నైలో జరుగుతుందని వివరించారు. ఈ మేరకు తమిళ్ కుమరన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్, డిప్యూటీ చైర్మన్ ప్రేమ్ శివసామి కూడా పాల్గొన్నారు. 

లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని నిర్మించడం తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్-2, భారతీయుడు-2 సినిమాలు ఈ బ్యానర్లోనే రానున్నాయి. అటు, రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

'జైలర్' సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్ లో సినిమాలను రజనీ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలకు సంబంధించిన వివరాలను లైకా వర్గాలు త్వరలోనే ప్రకటించనున్నాయి.

Rajinikanth
Lyca Productions
New Movies
Kollywood
  • Loading...

More Telugu News