Nandyala: కరీముల్లా హత్యకేసులో వీడిన మిస్టరీ.. ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భర్తను అడ్డుతొలగించుకున్న ముగ్గురు పిల్లల తల్లి!

wife killed husband for Facebook Lover in nandyala district

  • ఆళ్లగడ్డలో కలకలం రేపిన కరీముల్లా హత్య కేసు
  • ఫేస్‌బుక్‌లో నిందితురాలికి పరిచయమైన వంశీకుమార్‌రెడ్డి
  • ఇద్దరూ కలిసి కరీముల్లా హత్యకు ప్లాన్
  • ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కలకలం రేపిన ఆటోడ్రైవర్ కరీముల్లా హత్యకేసు మిస్టరీ వీడింది. ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భార్యే భర్తను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లింగదిన్నె రహదారిలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఈ నెల 8న ఓ గోనెసంచిలో కరీముల్లా మృతదేహం బయటపడింది. భార్య మాబ్బి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను విచారించినా  ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, మాబ్బి ప్రవర్తనను అనుమానించిన పోలీసులు ఆమె ఫోన్‌లోని వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
కడప జిల్లా పెద్దముడియం మండలం జె.కొత్తపల్లి గ్రామానికి చెందిన వంశీకుమార్‌రెడ్డితో ఆమె ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా అతడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకుంటే తమకు ఇక అడ్డం ఉండదని భావించింది. ఇద్దరూ కలిసి ఈ నెల 1న మద్యం మత్తులో ఇంట్లో నిద్రపోతున్న కరీముల్లా మెడకు తీగ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాతి రోజు ఇద్దరూ కలిసి కరీముల్లా మృతదేహాన్ని తీసుకెళ్లి పొదల్లో  పడేశారు. మాబ్బి వయసు 33 సంవత్సరాలు కాగా, ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వంశీకుమార్ రెడ్డి వయసు 22 ఏళ్లు. 

అహోబిలంలో ప్లాన్
కరీముల్లాను హత్య చేసిన అనంతరం పెళ్లి చేసుకోవాలని మాబ్బి, వంశీకుమార్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. హత్యకు ముందు రోజు ఇద్దరూ అహోబిలంలో కలుసుకుని హత్యకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఎలా ఉండాలన్న విషయంపైనా చర్చించుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త మృతదేహంపై పడి మాబ్బి పెద్దగా రోదించడం, ఇతరులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే, ఆ తర్వాత ఆమె ప్రవర్తన అనుమానాస్పందంగా ఉండడంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.

Nandyala
Kurnool
Crime News
Murder Case
Facebook Love
  • Loading...

More Telugu News