Food crisis: ఉప్పూ, చెట్ల ఆకులే వారి భోజనం.. బుర్కినా ఫాసోలో జనం ఆకలి కేకలు

Humanitarian situation dire in Burkina Faso
  • వారాల తరబడి వాటితోనే ఆకలి తీర్చుకుంటున్నారు
  • ఈ ఆఫ్రికా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం
  • ఉగ్రవాదం, సైనిక పాలనతో సాయానికి అడ్డంకులు
ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో జనం పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధులు చెబుతున్నారు. అక్కడి ప్రజలకు రోజుల తరబడి భోజనమే దొరకని పరిస్థితి నెలకొందని వివరించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో, మరో దారిలేక ఉప్పూ, చెట్ల ఆకులు తింటూ కడుపు నింపుకుంటున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన మార్టిన్ గ్రిఫిత్ తెలిపారు.

 గ్రిఫిత్ ఇటీవల బుర్కినా ఫాసోలో పర్యటించారు. ఓవైపు ఉగ్రవాదం, మరోవైపు సైనిక పాలన.. బుర్కినా ఫాసో ప్రజల జీవితాలను దుర్భరం చేశాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు మరే ఇతర సంస్థల నుంచి వారికి సాయం అందించడం సాధ్యం కావడంలేదని వాపోయారు. దేశంలోని చాలా ప్రాంతాలను అక్కడి ఉగ్రవాదులు మిగతా ప్రపంచంతో సంబంధంలేకుండా చేశారని గ్రిఫిత్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సైనికులపై దాడి చేసి ఉగ్రవాదులు వారిని మట్టుబెడుతున్నారని చెప్పారు. 

దేశంలోని మిగతా ప్రాంతాలతో ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో జనం అభద్రతాభావానికి లోనవుతున్నారని గ్రిఫిత్ వివరించారు. వారిని ఆదుకోవడానికి, అవసరమైన సాయం చేయడానికి ఐక్యరాజ్యసమితితో పాటు పలు ఇతర సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. బుర్కినా ఫాసో జనాభాలో నాలుగోవంతు.. అంటే సుమారు 50 లక్షల మందికి అత్యవసర సాయం అవసరమని గ్రిఫిత్ చెప్పారు. ఇందుకోసం సుమారు 805 మిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరం కాగా, అందులో మూడోవంతు కూడా అందట్లేదని వివరించారు. 

ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదుల దాడుల్లో బుర్కినా ఫాసోలో వేలాది మంది చనిపోగా, 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దేశంలో తొమ్మిది నెలల కాలంలోనే మూడుమార్లు సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు తిండి, మంచినీటికి కరవు ఏర్పడిందని చెప్పారు. ఆహార పదార్థాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. దీని ఫలితంగా ఇటీవలే 8 మంది చిన్నారులు పోషకాహార లోపంతో చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి గ్రిఫిత్ తెలిపారు. కొన్ని సైనిక హెలికాప్టర్ల ద్వారా మారుమూల గ్రామాలకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. అయితే, ఆ హెలికాప్టర్లు తెచ్చే ఆహారపదార్థాలు ఎటూసరిపోవని, దీంతో తాము ఉప్పూ, చెట్ల ఆకులతోనే కడుపు నింపుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Food crisis
leaves
Burkina Faso
UNO

More Telugu News