DAV Public School: చిన్నారిపై అఘాయిత్యం కేసు.. డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు

Telangana government ordered to Shut down DAV Public School in Banjara Hills

  • డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
  • తక్షణం గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మంత్రి సబిత
  • అక్కడి విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఆదేశం
  • కారు డ్రైవర్, స్కూల్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హైదరాబాదు, బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. తక్షణమే ఇది వర్తిస్తుందని, ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ డీఈవోను ఆదేశించారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యలను సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ కమిటీలో విద్యాశాఖ డైరెక్టర్, మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీసు విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. వారం రోజుల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుందన్నారు. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడైన ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్ భీమన రజనీకుమార్, మాధవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిద్దరినీ వారం రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, నిందితుడు రజనీకుమార్‌కు సంబంధించి మరిన్ని విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి బాధితుల్లో 10 నుంచి 15 మంది చిన్నారులు ఉంటారని భావిస్తున్నారు. పేరుకే డ్రైవర్ అయినా స్కూల్‌లో పెత్తనమంతా అతడిదేనని చెబుతున్నారు. 11 సంవత్సరాలుగా మాధవి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఉపాధ్యాయులకు సలహాలు ఇవ్వడం, బోధనకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోవడం, ఫీజుల వసూళ్లు వంటివి కూడా అతడే చూసుకునేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పాఠశాలలో ఉన్న 14 సీసీటీవీ కెమెరాల్లో మూడు పనిచేయడం లేదన్న విషయం తెలుసుకున్న నిందితుడు దానిని ఆసరాగా తీసుకుని చిన్నారులను తనకు కేటాయించిన గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. కాగా, నల్గొండ జిల్లాలో గతంలో నిందితుడిపై వరకట్న వేధింపుల కేసు కూడా నమోదైనట్టు గుర్తించారు.

DAV Public School
Banjara Hills
Hyderabad
  • Loading...

More Telugu News