CM Jagan: వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడు కూడా బయల్దేరాడు: ఆళ్లగడ్డలో సీఎం జగన్ వ్యాఖ్యలు

CM Jagan comments at Allagadda rally
  • నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • రైతు భరోసా నిధుల విడుదల
  • ఎల్లో మీడియా అంటూ విమర్శలు
  • పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. మన ఖర్మ ఏమిటంటే, రాష్ట్రంలో ఇంత గొప్ప మార్పులు జరుగుతుంటే ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 

ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడు కూడా బయల్దేరాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దుష్ట చతుష్టయం మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. వీళ్లందరూ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. పండ్లున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు అన్నట్టుగా తయారైందని పేర్కొన్నారు. 

వీళ్ల చేతుల్లో మీడియా ఉందని, తాము ఏది చెబితే అది, ఏది రాస్తే అది జరుగుతున్నట్టు భ్రమింపచేయవచ్చన్న గర్వం వీళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. వీళ్లు కోరుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేందుకు కుతంత్రాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. 

ఆనాటికీ, ఈనాటికీ తేడా ఒకసారి గమనించాలని ప్రజలను కోరుతున్నానని తెలిపారు. అప్పటికీ, ఇప్పటికీ తమ బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలే తమ గుండెల మీద చేయివేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల బతుకుల గురించి ఏ ఈనాడు చెబితేనో, ఏ ఆంధ్రజ్యోతి చెబితేనో, ఏ టీవీ5 చెబితేనో, ఏ దత్తపుత్రుడు చెబితేనో నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు.
CM Jagan
Allagadda
Nandyal District
YSRCP

More Telugu News