Nagarkurnool District: చార్జీలకు రూ.200 గూగుల్ పే చేసి.. యువకుడిని రప్పించి మరీ హత్య!

A young man was lured and killed in Hyderabad after send Rs 200 for Charges

  • ప్రేమ వ్యవహారమే కారణం
  • పథకం ప్రకారం యువతితో మాట్లాడించిన కుటుంబ సభ్యులు
  • మాట్లాడాలని ఉందని పదేపదే ఫోన్లు
  • చార్జీలకు డబ్బులు లేవంటే గూగుల్ పే ద్వారా రూ. 200 పంపిన వైనం
  • చంపేసి ముషీరాబాద్ పరిధి లోని నాలాలో పడేసిన నిందితులు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన శివకుమార్ (18) మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ప్రేమ వ్యవహారమే అతడి ప్రాణాలు తీసిందని తేలింది. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన బాలస్వామి ఉపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి పటాన్‌చెరులో ఉంటున్నాడు. ఆయన కుమారుడు శివకుమార్ కూలి పనులు చేస్తాడు. ఈ క్రమంలో ముషీరాబాద్‌కు చెందిన యువతితో శివకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 

ఆమెను కలిసేందుకు శివ తరచూ ముషీరాబాద్ వెళ్లి వస్తుండేవాడు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో వారు శివను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 7న యువతితో శివకు ఫోన్ చేయించారు. చూడాలని ఉందని, ఒకసారి రావాలని ఆమె కోరింది. యువతి కుటుంబ సభ్యులు కూడా శివకు పదేపదే ఫోన్ చేసి మాట్లాడాలని ఉందని, ఒకసారి వచ్చి వెళ్లాలని కోరారు. అయితే, చార్జీలకు తన వద్ద డబ్బులు లేవని అతడు చెప్పడంతో యువతి ఫోన్ నుంచి రూ. 200 గూగుల్ పే చేశారు. దీంతో డబ్బులు డ్రా చేసుకున్న శివ అదే రోజు సాయంత్రం ముషీరాబాద్‌ వెళ్లాడు. 

అలా వెళ్లినవాడు రాత్రయినా రాకపోవడంతో ఆందోళన చెందిన శివ తల్లి కుమారుడికి ఫోన్ చేసింది. తాను ముషీరాబాద్‌లోని యువతి వద్దకు వచ్చానని చెబుతుండగానే ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా అతడి నుంచి ఫోన్ లాక్కుని స్విచ్ఛాప్ చేశారు. ఆ రోజు రాత్రి అతడు ఇంటికి చేరుకోలేదు. దీంతో మరుసటి రోజు శివ తల్లిదండ్రులు ముషీరాబాద్ వచ్చి యువతి తల్లిదండ్రులను కలిశారు. తమ కుమారుడి ఆచూకీ చెప్పాలని కోరారు. అయితే, శివ తమ వద్దకు రాలేదని వారు చెప్పడంతో శివ తల్లిదండ్రులు పటాన్‌చెరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. శివ తమ ఇంటికి వచ్చిన రోజే హత్య చేసి ముషీరాబాద్ సమీపంలోని నాలాలో పడేసినట్టు చెప్పారు. తమవి వేర్వేరు కులాలు కావడంతోనే శివను హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. శివకుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Nagarkurnool District
Musheerabad
Patancheru
Murder Case
Love
  • Loading...

More Telugu News