Komatireddy Raj Gopal Reddy: నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... మీలో ఎవరు పోటీ చేస్తారంటూ కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్

Komatireddy Rajagopal Reddy files nominations

  • నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నికలు
  • విడుదలైన నోటిఫికేషన్
  • ఈ నెల 14వరకు నామినేషన్లకు గడువు
  • రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించిన రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు నామినేషన్ వేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తదితర నేతలు ఉన్నారు. 

నామినేషన్ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భవిష్యత్తును మునుగోడు ఉప ఎన్నిక నిర్దేశిస్తుందని అన్నారు. మునుగోడులో తనపై ఎవరు పోటీకి వస్తారో రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా?... ఎవరొచ్చినా విజయం నాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. "లక్షల కోట్ల మేర ప్రజల సొమ్ము దోచుకున్న మిమ్మల్ని వదిలేది లేదు... వచ్చే ఏడాది బతుకమ్మ నాటికి కవిత జైలుకెళ్లడం ఖాయం" అని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో నామినేషన్ల పర్వం షురూ అయింది. ఈ నెల 14న నామినేషన్ల దాఖలుకు తుది గడువు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17వరకు అవకాశం ఇచ్చారు. నవంబరు 3న పోలింగ్, 6వ తేదీన ఫలితాల వెల్లడి ఉంటుంది. 

కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ నెల 12న, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈ నెల 14న నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని తెలుస్తోంది. అటు, ఈ ఉప ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని బరిలో దించేదీ, లేనిదీ మరికొన్నిరోజుల్లో తేలనుంది.

Komatireddy Raj Gopal Reddy
Nominations
Munugodu
Bypolls
BJP
TRS
Congress
  • Loading...

More Telugu News