CPR: సీపీఆర్ చేయడం తెలిస్తే.. ప్రతి పదిమంది రోగుల్లో ఏడుగురిని కాపాడొచ్చు!

CPR can save 7 out of 10 cardiac arrest patients

  • దీని కారణంగా దేశంలో ఏటా 20 లక్షల మంది బలి
  • రక్త సరఫరా ఆగిపోతే మూడు నిమిషాల్లో మెదడు డెడ్
  • కార్డియాక్ అరెస్ట్, గుండె పోటు వేర్వేరు

సీపీఆర్ అంటే.. కార్డియో పల్మనరీ రీససిటేషన్. ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ షిల్లాంగ్ లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆ సమయలో అక్కడున్న వారిలో ఒక్కరికీ సీపీఆర్ తెలియకపోవడం వల్లే కలామ్ ను కాపాడుకోలేకపోయాం. 

అందుకనే మన సమాజంలో ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రక్రియ తెలుసుకోవాలి. తక్షణం సీపీఆర్ చేయడం వల్ల ప్రతి 10 మంది హృద్రోగుల్లో 7 గురిని కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రాధాన్యతను గురించి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్డియాలజీ విభాగం హెడ్ ఆదిత్య కుమార్ తెలియజేశారు.

మన సమాజంలో సడెన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్ సీఏ) కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఏటా 20 లక్షల మందిని ఎస్ సీఏ బలి తీసుకుంటున్నట్టు ఆదిత్యకుమార్ చెప్పారు. ‘‘గుండె కండరాలకు విద్యుత్ ప్రేరణలు అందించడంలో ఏవైనా అవరోధాలు ఏర్పడితే అప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్నే ఎస్ సీఏ అంటారు. గుండె నుంచి రక్త సరఫరా ఆగిపోతే మూడు నిమిషాల్లోనే మెదడు చనిపోతుంది. రక్త సరఫరాను తిరిగి వెంటనే ప్రారంభించడంలో విఫలమైతే మరణానికి దారితీస్తుంది’’ అని వివరించారు. 

గుండెపై రెండు చేతులతో అదమడం, నోటి నుంచి గట్టిగా గాలిని పంప్ చేయడాన్నే సీపీఆర్ గా చెబుతారు. ఇక హార్ట్ ఎటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. కార్డియాక్ అరెస్ట్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. వారిలో చలనం ఉండదు. వయసు, జాతితో సంబంధం ఉండదు. జన్యు సంబంధం కారణాలు, గుండె లోపాలు, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, పొగతాగడం ఎస్ సీఏ కు దారితీస్తాయి. 

హార్ట్ ఎటాక్ అన్నది గుండెకు రక్త సరఫరాలో ఆటంకాల వల్ల వచ్చే పరిస్థితి. ఛాతీలో నొప్పి, భుజం, చేయి, వెనుక భాగం, మెడ, దవడ భాగంలో అసౌకర్యం, ఒక్కోసారి కడుపు పై భాగంలో నొప్పి, చెమటలు పట్టడం, అజీర్ణం, గుండె మంట ఇవన్నీ కూడా హార్ట్ ఎటాక్ సంకేతాలు. 

CPR
sca
sudden cardiac arrest
life saves
  • Loading...

More Telugu News