Ashok Gehlot: రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలకలం.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Nothing In My Hands says Ashok Gehlot to high command
  • కాంగ్రెస్ అధ్యక్ష రేసులో అశోక్ గెహ్లాట్
  • స్పీకర్‌ సీపీ జోషిని సీఎం చేయాలన్న యోచనలో గెహ్లాట్
  • సచిన్ పైలట్‌ వైపు మొగ్గు చూపిన అధిష్ఠానం
  • స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందించిన ఎమ్మెల్యేలు
  • రసకందాయంలో రాజస్థాన్ రాజకీయం
రాజస్థాన్ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కాలన్న దానిపై రాజస్థాన్ కాంగ్రెస్‌ రెండుగా విడిపోయింది. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి పదవి రేసులో సచిన్ పైలట్ ముందున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతుండగా గెహ్లాట్ వర్గం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. 

ఈ క్రమంలో నిన్న సాయంత్రం సీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించారు. అయితే, అంతకంటే ముందే గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. తాను కూడా రాజీనామా చేస్తానని పీసీసీ అధ్యక్షుడు కూడా ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో స్పందించిన అధిష్ఠానం సీఎల్పీ భేటీని రద్దు చేసింది. సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లిన గెహ్లాట్, పైలట్ సహా అందరినీ ఢిల్లీ రావాలని ఆదేశించింది.

జోడు పదవులు కుదరవని రాహుల్ చెప్పడం వల్లే..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి జోడు పదవులు కుదరవని రాహుల్ గాంధీ చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. సీఎం పీఠం నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ భావించారు. అయితే, అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని భావించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ మాత్రం ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న సీపీ జోషికి ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుదలగా ఉన్నారు.

 పైలట్ తిరుగుబాటే కారణం
రెండేళ్ల క్రితం గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. ఇప్పుడిదే ఆయనను సీఎం కాకుండా అడ్డుకుంటోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సీఎం పీఠం ఎలా అప్పగిస్తారన్నది గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వాదన. అప్పట్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సచిన్ పైలట్‌కు సీఎం పీఠం అప్పగించాలన్న అధిష్ఠానం నిర్ణయాన్ని నిరసిస్తూ గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ జోషి నివాసానికి వెళ్లి రాజీనామా లేఖలు సమర్పించారు. పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కూడా పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. గెహ్లాట్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే, ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని, తానేమీ చేయలేనని ఆయన చేతులెత్తేసినట్టు సమాచారం.
Ashok Gehlot
Rajasthan
Sachin Pilot
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News