Hyderabad: జింఖానా తొక్కిసలాట ఘటనపై అజారుద్దీన్ పై కేసు

Police book case against Mohd Azharuddin and HCA

  • బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేసిన గాయపడ్డ అభిమానులు, పోలీసు సిబ్బంది
  • అజారుద్దీన్ బాధ్యతా రాహిత్యం వల్లే ఘటన జరిగిందని ఫిర్యాదు
  • సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద కేసు నమోదు చేసిన పోలీసులు

టీ20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిర్లక్ష్యం ఉందని, హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా నిర్వాహకులపై కేసు నమోదైంది. ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్న భారత్ –ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన అదితి ఆలియా, ఎస్ఐ ప్రమోద్ బేగంపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

టీ20 మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నారంటూ అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. టికెట్ల అమ్మకంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్ బాధ్యతా రాహిత్యం వల్లే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ల కోసం గురువారం జింఖానా మైదానానికి వేలాదిగా వచ్చిన అభిమానులు ఒక్కసారిగా టికెట్ల కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.

Hyderabad
Cricket
fans
gymkhana
police
case
azahruddin
  • Loading...

More Telugu News