Khammam District: బైక్ మీద లిఫ్ట్ అడిగాడు.. మధ్యలో ఇంజక్షన్ పొడిచి చంపేశాడు!

Man Killed Biker Who Gave Lift To Him in Khammam District

  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఘటన
  • బాధితుడి వీపులో ఇంజక్షన్ గుచ్చిన నిందితుడు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి
  • పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించిన పోలీసులు
  • పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు

బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి.. ఎక్కిన తర్వాత వెనక నుంచి ఇంజక్షన్ గుచ్చి చంపేశాడో కిరాతకుడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (48).. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో తన పెద్ద కుమార్తె వద్దనున్న భార్య ఇమాంబీని తీసుకొచ్చేందుకు నిన్న ఉదయం బైక్‌పై బయలుదేరాడు. ముదిగొండ మండలంలోని వల్లభి సమీపంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడిగారు. తమ బైక్‌లో పెట్రోలు అయిపోయిందని, తమలో ఒకరికి లిఫ్ట్ ఇస్తే పెట్రోలు తెచ్చుకుంటామని చెప్పడంతో జమాల్ సరేనని ఎక్కించుకున్నాడు. 

కొంతదూరం వెళ్లాక బైక్ ఎక్కిన వ్యక్తి జమాల్ వీపుపై ఇంజక్షన్‌తో పొడిచాడు. ఏదో గుచ్చుకున్నట్టు అనిపించడంతో జమాల్ బండి వేగాన్ని తగ్గించి ఏం చేశావని అతడిని అడిగాడు. దీంతో అతడు బైక్ దూకి వెనకే వస్తున్న మరో నిందితుడి బైక్ ఎక్కి పరారయ్యాడు. మరోవైపు, ఇంజక్షన్ ప్రభావంతో కళ్లు బైర్లు కమ్ముతుండడంతో మరికొంత దూరం ముందుకు వెళ్లి రోడ్డుపక్కన ఉన్న వారిని నీళ్లు ఇవ్వాలని జమాల్ కోరాడు. నీళ్లు తాగిన తర్వాత తన భార్యకు ఫోన్ కలపాలని అడిగాడు. ఫోన్ కలవకపోవడంతో అక్కడి వారితో జరిగిన విషయం చెప్పాడు. తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి వెనక నుంచి ఏదో గుచ్చి పారిపోయాడని చెప్పి పడిపోయాడు. 

వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ పడివున్న సిరంజిని స్వాధీనం చేసుకున్నారు.

పిచ్చి కుక్కలను చంపేందుకు వాడే రసాయనంతో..
లిఫ్ట్ అడిగి.. ఇచ్చిన వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యేనని తేలింది. జమాల్ కంటే ముందు నిందితులు మైసయ్య అనే వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. అతడు ఇవ్వకుండా వెళ్లిపోవడంతో బతికిపోయాడు. లేదంటే ఇంజక్షన్ అతడిపైనే  ప్రయోగించి ఉండేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అయితే, దీని వెనకున్న కారణాలు ఏంటనేవి మాత్రం తెలియరావడం లేదు. పిచ్చికుక్కలను చంపేందుకు వాడే రసాయనాన్ని ఇంజక్షన్‌లో ఎక్కించినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వారు పట్టుబడిన తర్వాత హత్యకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Khammam District
Mudigonda
Injection
Murder
Crime News
  • Loading...

More Telugu News