Haryana: హర్యానాలో విషాదం.. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఏడుగురి మునక

7 Drown In Haryana During Ganesh Idols Immersion Ceremony
  • నిమజ్జనం చేస్తుండగా ప్రమాదాలు
  • సోనిపట్‌లో ముగ్గురు, మహేంద్రగఢ్‌లో నలుగురు మృత్యువాత
  • విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
  • బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ
హర్యానాలో వినాయక నిమజ్జనాల్లో విషాదం చోటుచేసుకుంది. హర్యానాలో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోనిపట్‌లో నిమజ్జనం చేస్తూ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మహేంద్రగఢ్‌లో నలుగురు మృతి చెందారు.

నిమజ్జనం సందర్భంగా సమీపంలోని చెరువులు, నదుల వద్ద ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సోనిపట్‌లోని మిమార్పూర్ ఘాట్ వద్ద నిమజ్జనానికి కుమారుడు, మేనల్లుడితో కలిసి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. మహేంద్రగఢ్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న కాలువలో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9 మంది కొట్టుకుపోయారు. 

వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అర్ధరాత్రి సమయంలో 8 మందిని వెలికి తీశారు. వీరిలో నలుగురు మృతి చెందారు. మహేంద్రగఢ్, సోనిపట్ జిల్లాల్లో నిమజ్జనం సందర్భంగా పలువురు మృతి చెందిన ఘటనలు విషాదం నింపాయని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

నీటిలో మునిగిపోయిన ఎంతోమందిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయని, బాధితులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు వినాయక చవితి ఉత్సవాలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఈసారి ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్నారు. నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.
Haryana
Sonipat
Mahendragarh
Ganesh Idols Immersion

More Telugu News