Serial Killer: మధ్యప్రదేశ్ లో సీరియల్ కిల్లర్... నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులే అతడి లక్ష్యం!

Serial Killer on prowl in Madhya Pradesh as people panics

  • దారుణంగా తలపై కొట్టి హత్యలు
  • సుత్తి, రాళ్లే ఆయుధాలు
  • 48 గంటల వ్యవధిలో ఇద్దర్ని చంపిన హంతకుడు
  • సాగర్ లో భయాందోళనలు
  • పోలీసులకు సవాల్ గా పరిణమించిన సీరియల్ కిల్లర్

మధ్యప్రదేశ్ లోని సాగర్ నగరంలో వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సాగర్ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న హత్యలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రాత్రివేళ నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే లక్ష్యంగా చేసుకుంటూ హంతకుడు దారుణాలకు పాల్పడుతున్నాడు. 

సుత్తి, బండరాళ్లతో తలపై మోదుతూ హత్యలు చేస్తున్నాడు. కొన్నిసార్లు హత్యలకు ఉండే కొయ్య పిడిని కూడా ఉపయోగిస్తున్నాడు. అంతేకాదు, హత్య జరిగిన చోట "పట్టుకోండి చూద్దాం" అంటూ సవాల్ చేస్తూ కొన్ని కార్డులను కూడా వదిలాడు. 

ఇప్పటిదాకా నాలుగు ఘటనలు ఒకే విధంగా జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనల్లో ముగ్గురు చనిపోగా, నాలుగో వ్యక్తి పుర్రె పగిలిపోయి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఆ సీరియల్ కిల్లర్ రెండ్రోజుల వ్యవధిలో రెండు హత్యలు చేయడంతో సాగర్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. 

కాగా, ఈ వరుస హత్యలు పోలీసులకు సవాల్ గా పరిణమించాయి. సంఘటన స్థలంలో కీలక ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో, పోలీసులు పాత కేసులను తిరగదోడుతున్నారు. దీనిపై డీజీపీ సుధీర్ సక్సేనా స్పందించారు. తానే స్వయంగా ఈ వ్యవహారంలో దర్యాప్తును పర్యవేక్షిస్తున్నానని, హంతకుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో మఫ్టీలో ఉన్న సాయుధ పోలీసులను నియమించామని తెలిపారు. 

మధ్యప్రదేశ్ లో గతంలోనూ వరుస హత్యలు జరిగాయి. ఆదేశ్ ఖమ్రా అనే వ్యక్తి కేవలం ట్రక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ సాగించాడు. ఖమ్రా ఏకంగా 34 మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశంలోనే భయానక సీరియల్ కిల్లర్ గా పేరుపొందాడు. పగటివేళ ఎంతో సామాన్యుడిలా, అందరితో కలిసిమెలిసి తిరిగే ఆదేశ్ ఖమ్రా... రాత్రి వేళ అయితే చాలు... నరరూప రాక్షసుడిలా మారిపోతాడు. అతడిని 2018లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు సాగర్ ఏరియాలో జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో, ప్రజలు నాటి హత్యాకాండను గుర్తుచేసుకుని హడలిపోతున్నారు.

Serial Killer
Bhopal
Sagar
Madhya Pradesh
  • Loading...

More Telugu News