Narendra Modi: 470 ఎకరాల్లో గుజరాత్ భూకంప మృతుల స్మారకం ‘స్మృతి వన్’లో విశేషాలెన్నో..

Modi inaugurates Gujarats Smriti Van memorial dedicated to earthquake victims

  • మొదటి దశను  ఈ రోజు ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  • భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అన్న మోదీ
  • ప్రత్యేక ఆకర్షణగా  వైబ్రేషన్, సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా భూకంపాన్ని అనుభవించే థియేటర్ 

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో 2001లో సంభవించిన భారీ భూకంపం సమయంలో ప్రజలు చూపిన దృఢత్వాన్ని గుర్తుచేసే ‘స్మృతి వన్’  స్మారకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ‘స్మృతి వన్’ అనేది కచ్ ప్రజల ప్రాణాలు కోల్పోయిన వారి అద్భుతమైన పోరాట స్ఫూర్తికి నివాళి అని మోదీ అన్నారు. గుజరాత్ ప్రభుత్వ అధికారుల ప్రకారం ఇలాంటి స్మారక చిహ్నం నిర్మించడం ఇదే మొదటిసారి. భుజ్ పట్టణానికి సమీపంలోని భుజియో కొండపై 470 ఎకరాల్లో విస్తరించి ఉంది. జనవరి 26, 2001న భుజ్ కేంద్రంగా సంభవించిన భూకంపం సమయంలో దాదాపు 13,000 మంది మరణించిన నేపథ్యంలో ఇది పునరుద్ధరణ స్ఫూర్తిని తెలియజేస్తుంది. స్మారక చిహ్నంలో  భూకంపం సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల పేర్లను రాశారు. ఇందులో అత్యాధునిక భూకంప మ్యూజియం కూడా ఉంది. 

రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం కొండపై 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత, మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి మ్యూజియం ప్రాంగణంలో కలియ తిరిగారు.  అక్కడి అధికారులు, టూర్ గైడ్స్  వివిధ అంశాలను ఆయనకు తెలియజేశారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మోదీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ మ్యూజియం 2001 భూకంపం తర్వాత  గుజరాత్ లో పునర్నిర్మాణ కార్యక్రమాలు, విజయగాథలను ప్రదర్శిస్తుంది. అలాగే, వివిధ రకాల విపత్తుల గురించి, భవిష్యత్తులో ఎలాంటి విపత్తులనైన ఎదుర్కోగలమన్న సంసిద్ధతను తెలియజేస్తుంది. ఈ మ్యూజియంలో 5డీ సిమ్యులేటర్ సహాయంతో భూకంపం యొక్క అనుభవం పొందడానికి ఒక బ్లాక్ ఏర్పాటు చేశారు. వైబ్రేషన్, సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా సందర్శకులు భూకంపాన్ని అనుభవించే ప్రత్యేక థియేటర్ ఈ ప్రాజెక్ట్  ముఖ్య ఆకర్షణలలో ఒకటి. ఇక,  భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు మరొక బ్లాక్‌ ఏర్పాటు చేశారు.

ఎనిమిది బ్లాకులతో 11,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ మ్యూజియంలో ఈ ప్రాంతంలోని హరప్పా నాగరికత, భూకంపాలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారం, గుజరాత్ సంస్కృతి, తుఫానుల వెనుక సైన్స్ తో పాటు భూకంపం తర్వాత కచ్ విజయగాథను ప్రదర్శిస్తారని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. సందర్శకుల కోసం మ్యూజియంలో 50 ఆడియో-విజువల్ మోడల్స్, హోలోగ్రామ్, ఇంటరాక్టివ్ ప్రొజెక్షన్ , వర్చువల్ రియాలిటీ సౌకర్యాలు కూడా ఉన్నాయని చెప్పింది.

  • Loading...

More Telugu News