Earth: మన భూమి లాంటి 'మహాభూమి'ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులే!

  • మరో భూమిని కనుగొన్న కెనడా శాస్త్రవేత్తలు
  • ఈ సూపర్ ఎర్త్‌కు రెండు సూర్యుళ్లు
  • దాని మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రం
  • మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో తిరుగుతున్న మహాభూమి
  • దాని మరో సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 1400 సంవత్సరాలు
Earth like planet that is bigger has deeper oceans and two suns found

చూస్తుంటే మరో భూమి కోసం అన్వేషిస్తున్న శాస్త్రవేత్తల కృషి ఫలించినట్టే ఉంది. భూమి కంటే అత్యంత పెద్దదైన ఓ ‘మహాభూమి’ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌరవ్యవస్థకు ఆవల కనిపించిన ఈ భూమి మన భూమి కంటే 70 శాతం పెద్దది. మన భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. దీనిపై లోతైన సముద్రాలు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రం ఉండే అవకాశం ఉంది. 

ఇంత పెద్దదైన ఈ గ్రహంపై సంవత్సర కాలం అంటే 11 రోజులు మాత్రమేనని చెబుతున్నారు. దీనికి రెండు సూర్యుళ్లు ఉన్నాయి. ఒకదాని చుట్టూ  భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుండగా మరోదాని చుట్టూ తిరిగేందుకు 1400 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కెనడాకు చెందిన మాంట్రియల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఈ భూమిని కనుగొంది. 

సూపర్ ఎర్త్ (మహాభూమి)గా పేర్కొంటున్న దీనికి టీవోఐ-1452బి అని పేరు పెట్టారు. ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే శాటిలైట్‌ (టీఈఎస్ఎస్‌), భూ ఆధారిత టెలిస్కోప్‌ల పరిశీలన సమయంలో ఈ గ్రహాన్ని గుర్తించారు. ఈ సూపర్ ఎర్త్‌.. హైడ్రోజన్‌, హీలియంతో కూడిన రాతి గ్రహం అయి ఉండొచ్చని, దీనిపై వాతావరణం తక్కువగా, లేదంటే అసలు ఉండకపోవచ్చని అంటున్నారు. 

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది మనకు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మనలాంటి భూమి మరోటి ఉందని మురిసిపోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఒక కాంతి సంవత్సరమంటే.. దాదాపు 9 లక్షల 50 వేల కోట్ల కిలోమీటర్లు. ఈ లెక్కన 100 కాంతి సంవత్సరాలు అంటే.. ఇక ఊహించుకోనక్కర్లేదు.

More Telugu News