dolo 650: ఏడాదిలో అమ్మిందే రూ. 350 కోట్లు.. ఇక డాక్టర్లకు వెయ్యి కోట్లు ఎలా ఖర్చు చేస్తామంటున్న 'డోలో 650' సంస్థ

Dolo 650 makers rubbishes allegations of spending Rs 1000 crore as freebies on doctors

  • డోలో 650 రాసేందుకు వైద్యులకు వెయ్యి కోట్ల తాయిలాలు ఇచ్చారని సుప్రీంకోర్టులో పిటిషన్
  • తీవ్రంగా పరిగణించి పది రోజుల్లోగా స్పందించాలని కేంద్రానికి సుప్రీం ధర్మాసనం ఆదేశం
  • ఈ వార్తల్లో నిజం లేదన్న డోలో 650 తయారీదారు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్

కరోనా మహమ్మారి సమయంలో వైరస్ బాధితులకు పారాసెటమాల్ డ్రగ్ ‘డోలో 650’ మాత్రను సిఫారసు చేసినందుకు గాను వైద్యులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చారనే వార్తలపై ఆ కంపెనీ స్పందించింది. ‘డోలో’ తయారుదారు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు ఈ ఆరోపణలను నిరాధారం అని ఖండించారు.
 
డోలో-650 మాత్రను రాసేందుకు తయారీదారులు డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను 10 రోజుల్లోగా తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

ఈ విషయంపై జయరాజ్ గోవిందరాజు మాట్లాడుతూ.. ‘కోవిడ్ టైమ్ లో డోలో 650 కోసం మేము రూ. 1,000 కోట్లు ఖర్చు చేశామనడంలో వాస్తవం లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఈ బ్రాండ్ ద్వారా మాకు రూ. 350 కోట్లు వచ్చాయి. అలాంటిది దీనికి కోసం మేం వెయ్యి కోట్లు ఎలా ఖర్చు చేస్తాం? మేమే కాదు ఏ కంపెనీ కూడా ఒక బ్రాండ్ కోసం అంత మొత్తాన్ని ఖర్చు చేయదు’ అని స్పష్టం చేశారు. వెయ్యి కోట్ల మొత్తం అనేది తమ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా మార్కెటింగ్ కోసం చేసిన ఖర్చు అన్నారు. డోలో 650 తో పాటు అన్ని రకాల పారాసెటమాల్ మాత్రల ధరలు నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 

డోలో 650 మాత్రం దశాబ్దానికిపైగా ప్రసిద్ధ, విశ్వసనీయ బ్రాండ్ గా మార్కెట్ లో బ్రాండ్ లీడర్‌గా ఉందని ఆయన అన్నారు. కరోనా సమయంలో ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ప్రకారం జ్వరాన్ని తగ్గించే మాత్రగా డోలో 650 మరింత ప్రాచుర్యం పొందిందని అభిప్రాయపడ్డారు. కేవలం డోలో మాత్రలు మాత్రమే కాకుండా విటమిన్ సి, జింక్ మాత్రలను కూడా కోవిడ్ కాలంలో విస్తృతంగా ఉపయోగించారని చెప్పారు. తమ కంపెనీపై ఇప్పటిదాకా ఎలాంటి ఎఫ్‌ఐఆర్ కాపీ తమకు అందలేదని చెప్పారు. సుప్రీంకోర్టులో వ్యాజ్యం విషయంలో ఏదైనా వివరణ ఇవ్వమని అడిగితే, డేటాను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News