Komatireddy Venkat Reddy: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సోనియాకు వివరిస్తా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy to meet Sonia Gandhi

  • తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
  • అదేబాటలో దాసోజు శ్రవణ్
  • రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి
  • సోనియా అపాయింట్ మెంట్ కోరిన వైనం 

తెలంగాణ కాంగ్రెస్ లో గత కొన్నిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అటు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వెంకట్ రెడ్డికి సమన్వయం కుదరడంలేదు. ఇరువురి మధ్య అనేక అంశాల్లో భేదాభిప్రాయాలు నెలకొన్నట్టు ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె అపాయింట్ మెంట్ కోరారు. రాష్ట్రంలో పరిస్థితులపై సోనియాకు వివరించనున్నారు. పార్టీలో తనకు అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయని, అందుకే సోనియా వద్దకు వెళుతున్నానని కోమటిరెడ్డి వెల్లడించారు. 

శశిధర్ రెడ్డి కూడా..

అటు, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా సోనియా గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి చర్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని శశిధర్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పరిస్థితులపై వీరిద్దరూ పార్టీ హైకమాండ్ కు తప్పుడు సమాచారం అందిస్తున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. 

కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, మునుగోడులో ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తనను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటిస్తేనే ప్రచారానికి వస్తానని ఆయన అన్నట్టు కథనాలు వస్తున్నాయి.

Komatireddy Venkat Reddy
Sonia Gandhi
Congress
Revanth Reddy
Telangana
  • Loading...

More Telugu News