Telangana Police: బీహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్ నేరగాళ్ల కాల్పులు.. తప్పించుకున్న ప్రధాన నిందితుడు

Cyber criminals in bihar firing on telangana police
  • వాహన కంపెనీల ఫ్రాంచైజీల పేరిట సైబర్ నేరాలు
  • పట్టుకునేందుకు బీహార్ వెళ్లిన తెలంగాణ పోలీసులు
  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ. 1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 ఫోన్ల స్వాధీనం
సైబర్ నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న నేరస్థులను పట్టుకునేందుకు బీహార్ వెళ్లిన తెలంగాణ పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వాహన కంపెనీల ఫ్రాంచైజీల పేరిట సైబర్ నేరాలకు పాల్పడిన కొందరు నేరగాళ్లు బీహార్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు నవడా జిల్లా వెళ్లారు.

భవానిబిగా గ్రామంలో నిందితులు ఉన్నట్టు తెలుసుకుని స్థానిక పోలీసుల సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.22 కోట్ల నగదు, 3 కార్లు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పీటీ వారెంట్‌తో హైదరాబాద్ తీసుకురానున్నారు.
Telangana Police
Bihar
Cyber Criminals

More Telugu News