Bhadrachalam: మళ్లీ పోటెత్తుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari water level crosses 50 ft near Bhadrachalam
  • ఇటీవలే వరదలకు నీట మునిగిన భద్రాచలం
  • గత మూడు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రల్లో వర్షాలు 
  • భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన నీటి మట్లం
మొన్నటి భారీ వరదలకు భద్రాచలం సహా పలు గ్రామాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో ఇంకా వరద బురద కూడా ఆరక ముందే మరోసారి గోదావరి పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు పొగిపొర్లుతున్నాయి. 

ఈ నేపథ్యంలో గంటగంటకూ గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. నిన్న ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.70 అడుగులుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 50 అడుగులు దాటిపోయింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

ఇక ఈ సాయంత్రానికి నీటి మట్టం 55 అడుగులు కూడా దాటే అవకాశం ఉందని... ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు.

దుమ్ముగూడెం మండలంలో బైరాగులపాడు - సున్నంబట్టి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం పూర్తిగా మునిగింది. తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, డ్యామ్ గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు.
Bhadrachalam
Godavari
Floods

More Telugu News