blood sugar: ఈ నాలుగు మార్పులతో బ్లడ్ షుగర్ దిగొస్తుంది..!

How can blood sugar be regulated
  • మధుమేహం జీవనశైలి సమస్య
  • కొన్ని చర్యలతో నియంత్రణ సులభం
  • పోషకాలతో కూడిన మితాహారం తీసుకోవాలి
  • నిత్యం వ్యాయామాలు తప్పనిసరి
  • ఒత్తిళ్లు లేకుండా చూసుకోవాలి
మధుమేహం జీవనశైలి సమస్య. ఈ సమస్య ఉన్న వారిలో రక్తంలోని చక్కెర స్థాయుల్లో అసమతుల్యం ఏర్పడుతుంది. ఒక్కోసారి బాగా పెరిగిపోవడం, ఒక్కోసారి తగ్గిపోవడం కూడా జరగొచ్చు. అందుకని రక్తంలో చక్కెరలను నియంత్రణలో పెట్టుకోవడం అవసరం. ఇందుకోసం జీవనశైలి పరంగా చేసుకోవాల్సిన మార్పులు నాలుగు ఉన్నాయి.

శారీరక చర్యలు..
మధుమేహం సమస్య బారిన పడిన వారే కాదు.. దీనికి దూరంగా ఉండాలనుకునే వారు సైతం శారీరక వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాలి. 40 నిమిషాల వరకు మోస్తరు స్థాయి వ్యాయామాలు చేసుకోవచ్చు. వారంలో కనీసం ఐదు రోజుల పాటు అయినా వీటిని ఆచరించాలి. వేగంగా నడక, సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్ వ్యాయామాలు ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. శరీరంలో జీవక్రియలు చురుగ్గా మారతాయి. అప్పుడు చక్కెరలు నియంత్రణలోకి వస్తాయి. 

బరువు తగ్గడం
స్థూలకాయం మధుమేహానికి శత్రువు. కనుక అధిక బరువుతో ఉంటే వెంటనే తగ్గించుకునేందుకు సంకల్పించాలి. శారీరక వ్యాయామాలతో కొంత వరకు ఫలితం ఉంటుంది. బరువు తగ్గడం కోసం ఆహారం మానేస్తే మంచి కంటే చెడు ఫలితాలే ఎక్కువే. దీనికి బదులు చక్కని పోషకాహారం మితంగా తీసుకుంటూ, మంచి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

ఆహారం
సమతులాహారం మంచిది. ఎప్పుడూ ఒకే తరహా ఆహారం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు తక్కువ ఫ్యాట్ ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే, తీసుకునే ఆహారంలో పీచు ఉండేలా చేసుకోవాలి. ముడి ధాన్యాలను తీసుకోవాలి. నూడుల్స్, పిజ్జా, ప్యాస్ట్రీలు, బర్గర్లు, చీజ్ ఉత్పత్తులు, స్వీట్లు, కేక్ లు, బ్రెడ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అధిక శాచురేటెడ్ ఫుడ్స్ ను తీసుకోవద్దు. అంటే సమోసా, చిప్స్, బిస్కెట్లు కూడా శాచురేటెడ్ ఆహారం కిందకే వస్తాయి. అలాగే, నాలుగు చపాతీలను ఒకేసారి తినొద్దు, ఒకసారి రెండు తీసుకోవచ్చు. స్కిన్ లెస్ చికెన్ ను పరిమితంగా తీసుకోవచ్చు. ఆల్కహాల్ అలవాటు ఉంటే వెంటనే గుడ్ బై చెప్పేయాలి.

ఒత్తిళ్లు..
ఒత్తిడి పెరిగిపోయినా మధుమేహం నియంత్రణ తప్పతుంది. అలాగే రక్తపోటు పెరిగినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఉండే వ్యవస్థలు. అంతేకాదు, అప్పటి వరకు రక్తపోటు లేని వారికి, మధుమేహం వచ్చిన తర్వాత కనిపించొచ్చు. ఒత్తిళ్లు ఎక్కువైతే గుండె జబ్బులు, స్ట్రోక్ రావచ్చు. రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది ఒత్తిడి. కనుక రోజులో 8 గంటల పాటు నిద్రించాలి. ప్రాణాయామం, యోగ, ధ్యాన ప్రక్రియలతో ఒత్తిడిని అధిగమించొచ్చు.
blood sugar
control
food
pressures
exercise

More Telugu News