Blue light: డిస్ ప్లేల నుంచి వచ్చే నీలిరంగుకాంతితో త్వరగా వృద్ధాప్య లక్షణాలు!

Blue light exposure tv mobile pc screen leds harms growing age

  • సహజ కాంతికి భిన్నంగా ఉండే కృత్రిమ కాంతితో దెబ్బ తింటున్న జీవ గడియారం
  • శరీరంలో జీవ క్రియలు, కణాల్లో మైటోకాండ్రియా పనితీరుపైనా ప్రభావం
  • వయసు మీద పడుతున్న కొద్దీ రావాల్సిన మార్పులు ముందే వస్తున్నాయని వెల్లడి

ఎల్ఈడీ లైట్లు, టీవీలు, కంప్యూటర్, ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ల డిస్ ప్లేల నుంచి వచ్చే నీలి రంగు కాంతి వల్ల ఇప్పటివరకు తెలిసిన దానికన్నా ఎక్కువే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటితో కేవలం కళ్లకు హాని కలగడం మాత్రమే కాకుండా.. మన శరీరంలో ఇతర జీవ గడియారాన్ని, ఇతర జీవక్రియలనూ ప్రభావితం చేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. ఎల్ఈడీ లైట్ల నుంచి వెలువడే నీలి రంగు కాంతి వల్ల వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తున్నట్టు తేలిందని వెల్లడించారు.

  • డిస్ ప్లేల నుంచి వెలువడే నీలి రంగు కాంతితో మనపై పడే ప్రభావం ఏమిటన్న దానిపై అమెరికాకు చెందిన ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు.  ఇందుకోసం మనుషుల జీవ క్రియలతో పోలి ఉండే ‘డ్రోసోఫిలా మెలనోగాస్టర్’ రకం ఈగలను ఎంచుకుని ప్రయోగం చేశారు.
  • రెండు రోజుల వయసు, 20, 40, 60 రోజుల వయసున్న ఈగలను తీసుకుని బ్యాచ్ లుగా విభజించారు. వాటిని మొదట పూర్తిగా చీకట్లో ఉంచి.. ఆ తర్వాత నీలి రంగు ఎల్ఈడీ కాంతిలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వాటి శరీరాల్లో జరిగిన మార్పులను పరిశీలించారు.
  • సాధారణంగా శరీరంలో కొన్ని రకాల కణాలు కాంతికి ప్రతిస్పందిస్తుంటాయి. కానీ నీలి రంగు కాంతి కారణంగా అలా ప్రతిస్పందించని.. అంతర్గత అవయవాల కణాలపైనా ఆ కాంతి ప్రభావం పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • మన శరీర కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలను నీలి రంగు కాంతి ప్రభావితం చేస్తోందని.. మొత్తంగా కణాల పనితీరుపై ప్రభావం పడుతోందని తేల్చారు.
  • సాధారణంగా మనకు వయసు పైబడిన కొద్దీ, వృద్ధాప్యం దరి చేరిన కొద్దీ మైటోకాండ్రియాలలో పలు రకాల రియాక్షన్లు నిలిచిపోతాయి. అచ్చం అదే తరహాలో నీలి రంగు కాంతి కూడా ప్రభావం చూపిస్తోందని.. అందువల్ల వయసు మీద పడిన లక్షణాలు ముందుగానే వస్తున్నాయని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జగా గీబుల్టోవిచ్ తెలిపారు.

సాధారణ కాంతితో అంతా సాధారణంగా..
సూర్యరశ్మి నుంచి వచ్చే సహజ కాంతి మన శరీరంలో అన్ని జీవ క్రియలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 24 గంటల పాటు కొనసాగే సర్కాడియన్ రిథమ్ (జీవ గడియారం) దీనితోనే నడుస్తుందని వివరిస్తున్నారు. సహజ కాంతికి భిన్నంగా ఉండే వేర్వేరు కాంతులు, విద్యుద్దీపాల కారణంగా జీవగడియారంపై ప్రభావం పడి.. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి, మెదడు పనితీరు, కణాల పునరుత్పత్తి వంటివి దెబ్బతింటున్నాయని తమ పరిశోధనలో తేలిందని వివరిస్తున్నారు.

Blue light
TV
Mobile
Computer
Displays
Effect on Circadium rithum
Effect of Blue light
Offbeat
Science
Health
  • Loading...

More Telugu News