Ocean: సముద్రాల్లో ‘డెత్ పూల్స్​’.. అందులోకి వెళితే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే!

  • అత్యంత గాఢమైన లవణాలతో కూడిన సరస్సును గుర్తించిన శాస్త్రవేత్తలు
  • జల చరాలు అందులోకి ప్రవేశిస్తే కాసేపట్లోనే చనిపోతాయని వెల్లడి
  • రక్షణ లేకుండా మనుషులు వెళ్లినా బతకడం కష్టమనే అంచనాలు
Danger pool at the bottom of sea that kills anything swims into it

అదంతా పెద్ద సముద్రం.. అందులో ఎక్కడైనా నీళ్లు ఒకేలా ఉంటాయని అనుకుంటాం. కానీ భూమిపై ఉన్నట్టుగా సముద్రాల్లోనూ చిన్నపాటి సరస్సులు ఉన్నాయి. అన్నీ నీళ్లే అయినా ఈ సరస్సుల్లో ఉండే నీళ్లు వేరేగా, విడిగా ఉన్నాయి. కానీ ఈ సరస్సులు మహా ప్రమాదకరమైనవి. వాటిలోకి ప్రవేశించే జల చరాలు ఏవైనా కాసేపట్లో ప్రాణాలు వదిలేయాల్సిందే. అత్యంత గాఢమైన లవణాలతో కూడిన ఈ సరస్సులను ‘బ్రైన్ పూల్స్’ అంటారు. ఇలాంటి ‘డెత్ పూల్’ను ఈజిప్ట్‌, సౌదీ అరేబియా మధ్యలోని గల్ఫ్‌ ఆఫ్‌ అకాబా ప్రాంతంలో 'రెడ్ సీ' (ఎర్ర సముద్రం) అడుగున శాస్త్రవేత్తలు గుర్తించారు.

‘డెత్ పూల్’ను ఎలా గుర్తించారు?
సముద్రం అడుగున పరిస్థితులు, జీవ రాశులపై అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ మయామీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సముద్రంలో పైన నౌక నుంచి అడుగు భాగంలోకి రిమోట్ ద్వారా నడిచే అండర్ వాటర్ వెహికల్ ను పంపి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే గల్ఫ్ ఆఫ్ అకాబా ప్రాంతంలో ‘డెత్ పూల్’ (మృత్యు సరస్సు)ను గుర్తించారు. సుమారు 1,770 అడుగుల లోతున సముద్రపు నేలపై చిత్రంగా కనిపిస్తున్న ఈ పూల్ ను అండర్ వాటర్ వెహికల్ కెమెరాల ద్వారా చూసి ఆశ్చర్యపోయారు. అదేమిటో చూసేందుకు ఆ వెహికల్ ను ఆ నీటిలోకి పంపి శాంపిల్స్ను పైకి తెప్పించుకుని పరిశీలించారు కూడా. ఈ పరిశోధన వివరాలు ఇటీవలే నేచర్‌ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

అసలు ఆక్సిజన్ అందని పరిస్థితిలో..
అత్యంత ఎక్కువ స్థాయిలో లవణాలతో కూడిన ఈ చిన్నపాటి సరస్సు సుమారు 40 మీటర్ల కన్నా వెడల్పుతో ఉంది. ఇందులో ఆక్సిజన్ అసలే ఉండదని.. అంత గాఢత ఉన్న నీరు కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల దానిలోకి ప్రవేశించే చేపలుగానీ, ఇతర జల చరాలుగానీ వెంటనే చనిపోయే అవకాశాలు ఎక్కువని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త శామ్‌ పుర్కిస్‌ తెలిపారు.

  • చిత్రమేమిటంటే.. ఇంత ప్రమాదకర పరిస్థితులను కూడా తట్టుకుని కొన్ని రకాల సూక్ష్మజీవులు డేంజర్ పూల్ లో బతుకుతున్నట్టు ఆ నీటి శాంపిల్స్ లో గుర్తించామని శామ్ వెల్లడించారు. ఆ పూల్ లోకి వచ్చి చనిపోయే జల చరాలను అవి తింటూ బతుకుతున్నాయని వివరించారు.
  • భూమిపై సముద్రాల ఏర్పాటు నుంచి భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి మనుషులు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను తట్టుకునే అంశాల దాకా ఎన్నో అంశాలకు తమ పరిశోధన దోహదం చేస్తుందని శామ్ పుర్కిస్ వెల్లడించారు.

More Telugu News