Telangana: బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌రం: తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ

puvvada ajay kumar hits back botsa and ambati comments
  • హైద‌రాబాద్ ఇస్తారా అనడం అసంద‌ర్భం, అర్థ‌ర‌హిత‌మ‌న్న‌ పువ్వాడ
  • జ‌గ‌న్‌తో బొత్స‌, అంబ‌టిలు చ‌ర్చించి 5 గ్రామాల‌ను ఇప్పించాలని సూచ‌న‌
  • కేసీఆర్‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌కు వారిద్ద‌రే కృషి చేయాల‌ని విన‌తి
  • త‌న‌ వ్యాఖ్య‌ల్లో త‌ప్పేముందో అర్థం కావ‌డం లేద‌న్న తెలంగాణ మంత్రి

భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపున‌కు గురి అయిన నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాన్ని రేకెత్తించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ మంగ‌ళ‌వారం మరోమారు మీడియా ముందుకు వ‌చ్చారు. పోల‌వ‌రం ఎత్తు పెంపు కార‌ణంగానే భ‌ద్రాచ‌లం ముంపున‌కు గురైందని ఆరోపించిన పువ్వాడ‌... వ‌రద నివార‌ణ చ‌ర్య‌ల‌కు గాను ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల్లోని 5 గ్రామాల‌ను తిరిగి తెలంగాణ‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

 ఈ వ్యాఖ్య‌ల‌పై ముందుగా ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆ త‌ర్వాత ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. బొత్స, అంబ‌టి వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు పువ్వాడ అజ‌య్ మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు.

ఏపీ మంత్రులు బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌ర‌మ‌ని, అస‌లు తాను మాట్లాడిన దానిలో తప్పేముందో కూడా త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల‌కు భ‌ద్రాచ‌లంతో పాటు అక్క‌డి ప్ర‌జ‌లు కూడా ముంపున‌కు గురి కాకూడ‌ద‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌ని ఆయ‌న తెలిపారు. వ‌రద నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణానికే 5 గ్రామాల‌ను ఇవ్వాల‌ని కోరుతున్నామ‌న్నారు. సున్నిత‌మైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

హైద‌రాబాద్ ఇస్తారా? అనడం అసంద‌ర్భమే కాకుండా అర్థ‌ర‌హిత‌మ‌ని పువ్వాడ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భ‌ద్రాద్రి రాముడు వ‌ర‌ద నీటిలో మునిగితే ఏపీ ప్ర‌జ‌ల‌కైనా బాధే క‌దా అని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లకు బొత్స‌, అంబ‌టిలు కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు. జ‌గన్‌తో వారిద్ద‌రూ చ‌ర్చించి 5 గ్రామాల‌ను తెలంగాణ‌కు ఇప్పించాల‌ని పువ్వాడ కోరారు. 5 గ్రామాల‌ను తెలంగాణ‌లో క‌లిపితేనే క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News