Corona Virus: ఫ్రిజ్ లో పెట్టిన మాంసంపైనా 30 రోజులు కరోనా వైరస్.. అధ్యయనం ద్వారా అంచనా!

covid virus may survive for 30 days on refrigerated frozen meat

  • చికెన్, మటన్, చేపలు, బీఫ్ పై శాస్త్రవేత్తల పరిశోధన
  • అచ్చం కరోనా తరహాలోని ఇతర వైరస్ లు 30 రోజుల కంటే ఎక్కువ కాలం బతకగలిగినట్టు గుర్తింపు
  • అదే తరహాలో కరోనా వైరస్ కూడా బతుకుతుందని అంచనా వేసిన శాస్త్రవేత్తలు

ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కరోనా వైరస్ విస్తరణపై ఇటీవల శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఒకరికొకరు సంబంధం లేకుండా అంటే కాంటాక్టులేమీ లేకుండా కూడా కరోనా వైరస్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు. దీనికి కారణం ఏమిటన్నది తేల్చేందుకు పలు అంశాలను పరిశీలించారు. అందులో భాగంగా చికెన్, మటన్, చేపలు, బీఫ్ వంటి వాటిని మార్కెట్ నుంచి సేకరించారు. వాటిపై కొన్ని రకాల కరోనా వైరస్ లను వేసి.. ఫ్రిజ్ లో, డీప్ ఫ్రీజర్ లో నిల్వ ఉంచారు. కొన్ని రోజుల తర్వాత వాటిని పరిశీలించగా.. మాంసంపై కరోనా తరహా వైరస్ లు సజీవంగా ఉన్నట్టు గుర్తించారు. తాజాగా అప్లైడ్ అండ్ ఎన్విరాన్ మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.

ఫ్రీజర్ లో పెట్టినా బతికిన వైరస్..
డీప్ ఫ్రీజర్ లో ఉంచినప్పుడు వైరస్ నిద్రాణంగా ఉన్నా.. దానిని బయటికి తీసిన వెంటనే యాక్టివ్ గా మారి ప్రత్యుత్పత్తి చేసుకోవడం మొదలు పెట్టాయని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికా క్యాంప్ బెల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమిలీ బైలీ తెలిపారు. ఫ్రిజ్ లో పెట్టిన మాంసంపై కరోనా వైరస్ నెల రోజులకుపైగా జీవించి ఉండగలదని పేర్కొన్నారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ప్యాకేజ్డ్ మాంసం వినియోగించే, తయారు చేసే ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణం ఇదేనని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మాంసం ఉత్పత్తుల విషయంలో శుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా మాంసం ప్రాసెసింగ్ చేసే ప్రాంతాలు, అక్కడ పనిచేసేవారు పరిశుభ్రత పాటించాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Corona Virus
COVID19
Frozen meat
meat
science
health
  • Loading...

More Telugu News