Vikram: అవన్నీ పుకార్లే... హీరో విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన చేసిన మేనేజర్

Chiyaan Vikram manager release official statement
  • విక్రమ్ కు గుండెపోటు అంటూ కథనాలు
  • తీవ్ర ఆందోళనలో అభిమానులు
  • విక్రమ్ గుండెపోటుకు గురికాలేదన్న మేనేజర్ 
  • ఛాతీలో స్వల్ప అసౌకర్యం మాత్రమేనని వివరణ
చియాన్ విక్రమ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారంటూ వచ్చిన వార్తలతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, హీరో విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

విక్రమ్ కు ఈ మధ్యాహ్నం ఛాతీలో స్వల్పంగా అసౌకర్యంగా అనిపించడంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణన్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు వినాల్సి రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విక్రమ్ కుటుంబం పరిస్థితిని కూడా ఆలోచించాలని, వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరంగా వ్యవహరించరాదని హితవు పలికారు. 

విక్రమ్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేనేజర్ వెల్లడించారు. ఈ అధికారిక ప్రకటనతో విక్రమ్ ఆరోగ్య విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నామని, ఊహాగానాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూర్యనారాయణన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Vikram
Health
Official Statement
Suryanarayanan
Manager
Kollywood

More Telugu News