Delhi CM: ‘నిజాయతీ పార్టీ’కి ఓటేస్తే గుజరాత్ లోనూ ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్

Free electricity in Gujarat too if you vote for Honest Party says Arvind Kejriwal

  • వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై ఆప్ ఫోకస్
  • వారం వారం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
  • అవినీతి, వ్యవసాయం, పంటలకు మద్దతు ధరలు, ఇతర అంశాలపై బహిరంగ చర్చలు నిర్వహిస్తానని ప్రకటన

గుజరాత్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ‘నిజాయతీ గల పార్టీ’కి ఓటేస్తే ఆ రాష్ట్రంలోనూ ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విద్యుత్ అంశంపై నిర్వహించిన బహిరంగ చర్చలో అర్వింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. తాను ఇకపై వారం వారం గుజరాత్ కు వస్తానని.. వచ్చిన ప్రతిసారి ఒక్కో అంశంపై ‘జన సంవాద్’ పేరిట బహిరంగ చర్చను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అందులో భాగంగా సోమవారం విద్యుత్ అంశంపై చర్చను నిర్వహించారు.

ప్రభుత్వాన్ని మార్చుకోవాలి
‘‘గుజరాత్ రాష్ట్ర ప్రజలు కూడా 24 గంటల పాటు అతి తక్కువ ధరకు, లేదా ఉచితంగా విద్యుత్ ను పొందవచ్చు. అందుకోసం వారు చేయాల్సిందల్లా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలను, ప్రభుత్వాన్ని మార్చుకోవాలి. నిజాయతీ ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలి. వచ్చే వారం గుజరాత్ లో విద్యుత్ కు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలతో ముందుకు వస్తాను..” అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

మంత్రులనూ రాత్రి పూట పని చేయించాలి..
గుజరాత్ లో వ్యవసాయానికి రాత్రి పూట విద్యుత్ ఇవ్వడం దారుణమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. గుజరాత్ లో మంత్రులను కూడా కాసేపు రాత్రి పూట సచివాలయంలో పనిచేయించాలని, అప్పుడే రైతుల బాధ ఏమిటో తెలుస్తుందని పేర్కొన్నారు. రాత్రి పూట విద్యుత్ సరఫరా వల్ల రైతుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే భయం
గుజరాత్ ప్రజలు దేనినీ ఉచితంగా కోరుకోబోరన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘గుజరాత్ కు చెందిన ఓ అతి పెద్ద నాయకుడు ఆ రాష్ట్రంలో ఎవరూ ఉచితంగా ఏదీ కోరుకోబోరని అన్నారు. ముందు ఉచిత విద్యుత్ ఇచ్చి చూడాలి. నిజానికి వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే భయం. ఎందుకంటే అలా ఉచిత విద్యుత్ ఇస్తే దోచుకోవడానికి ఏమీ ఉండదని వారు భయపడుతున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, నిజాయతీ ఉండటమే ఉచిత విద్యుత్ వెనుక మ్యాజిక్” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
తాము ఎన్నికల కోసం విద్యుత్ కంపెనీల నుంచి ఎలాంటి డబ్బులు, విరాళాలు అడగబోమని.. పైగా అవి మరింత బాగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. అందువల్ల కంపెనీలపై భారం తగ్గి తక్కువ ధరకే విద్యుత్ ఇవ్వగలుగుతాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News